ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ

 TRUE TIMES INDIA
0
అమరావతి: రాష్ట్రంలో గ్యాస్ సరఫరాలో తాత్కాలిక అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల ద్వారా మళ్లీ కిరోసిన్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే సోమవారం నుంచి ప్రతి రేషన్ కార్డు దారునికి లీటరు చొప్పున కిరోసిన్ అందజేయనున్నారు.
హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో విశాఖపట్నానికి ఈ నెల 21న చేరాల్సిన గ్యాస్ నౌక ఆలస్యంగా 26న చేరనున్నట్లు కేంద్రం రాష్ట్రానికి సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ప్రస్తుతం గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కేటాయించిన 2800 కిలోలీటర్ల కిరోసిన్‌ను వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
రేషన్ ద్వారా కిరోసిన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు పేర్కొన్నారు. సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.
గ్యాస్ నౌక విశాఖపట్నానికి చేరుకున్న వెంటనే సరఫరా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని, అప్పటివరకు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!