ఉరవకొండ: ఉరవకొండలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో “బీసీ గళం” సభకు సంబంధించిన పోస్టర్లను పార్టీ బీసీ విభాగం నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ నెల 26వ తేదీ అనంతపురంలోని లలిత కళా పరిషత్ వేదికగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పార్టీ బీసీ విభాగం నాయకులు మాట్లాడుతూ, బీసీల హక్కుల సాధన, వారి సమస్యల పరిష్కారం కోసం ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఐదు జిల్లాలకు చెందిన బీసీ వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు సంబంధించిన ఈ సభకు భారీగా ప్రజలు తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి బీసీ సోదరులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.ఈ సభ ద్వారా బీసీ వర్గాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు, వారి హక్కుల కోసం గళమెత్తే వేదికగా ఇది నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. సభ విజయవంతం కోసం పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర, జిల్లా కార్యదర్శి గోవిందు, తాలూకా అధ్యక్షుడు డిష్ సురేష్, రూరల్ అధ్యక్షుడు ధనుంజయ, టౌన్ అధ్యక్షుడు జోగి హనుమంతు పాల్గొన్నారు.
వారితో పాటు వడ్డే ఆంజనేయులు, రామకృష్ణ, భీమా, సుధాకర్, నీలప్ప, మాబు, రామాంజనేయులు, మహానంది, ఇంద్రావతి, సురేష్ తదితర వైకాపా బీసీ నాయకులు పాల్గొన్నారు.
