కలెక్టరేట్ ఎదుట ముదిరిన ‘ప్రజాబలం’ ఆమరణ దీక్ష

 

 గార్లదిన్నె భూకుంభకోణంపై విచారణ జరపాలి: సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామప్ప నాయక్ డిమాండ్



గార్లదిన్నె మండలంలో ప్రభుత్వ భూములు దళారుల పరమవ్వడంపై ‘ప్రజాబలం సంఘం’ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ముందు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురువారం నాటికి ఉద్రిక్తంగా మారింది. నిరుపేదల హక్కుల కోసం, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సంఘం నేతలు ఈ నిరసనకు దిగారు.

అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రామప్ప నాయక్ మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం కళ్లముందే విలువైన ప్రభుత్వ భూములు దళారుల చేతుల్లోకి వెళ్తున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను తక్షణమే రద్దు చేసి, సదరు భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

పేదలకే ప్రాధాన్యం ఇవ్వాలి

స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములను పెనకచర్ల గ్రామంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా లేదా సాగు భూమిగా పంపిణీ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాల్సిన కలెక్టర్ కార్యాలయం స్పందించకపోవడం దారుణమన్నారు. "శాంతియుతంగా పోరాటం చేస్తున్నా జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడం చూస్తుంటే అధికారులే అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది" అని రామప్ప నాయక్ ఆరోపించారు.

అధికారులదే పూర్తి బాధ్యత దీక్షలో కూర్చున్న నాయకుల ప్రాణాలకు ఏమైనా ప్రమాదం జరిగితే దానికి జిల్లా కలెక్టర్, స్థానిక రెవెన్యూ అధికారులే పూర్తి బాధ్యత వహించాలని ప్రజాబలం సంఘం హెచ్చరించింది.

కలెక్టర్ స్పందించే వరకు వెనకడుగు వేయం

భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, పెనకచర్ల పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష విరమించే ప్రసక్తే లేదని నాయకులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా దీక్షా శిబిరాన్ని సందర్శించి న్యాయమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో సంఘం ముఖ్య నాయకులు మేఘన, వీరతేజ, అబ్దుల్ గఫూర్, మహబూబాబాషా, కార్తీక్, పవన్ తదితరులు పాల్గొన్నారు.