రోజుకు 15–20 సార్లు విద్యుత్ అంతరాయం.. 40–50 ఏళ్ల నాటి స్తంభాలు, వైర్ల మార్పుపై ప్రభుత్వానికి గిరిజనసంఘం, సుంకే నాయక్ విజ్ఞప్తి
ఉరవకొండ ప్రాంతంలో తరచూ చోటుచేసుకుంటున్న విద్యుత్ అంతరాయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 40–50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, వైర్లతోనే ఇప్పటికీ సరఫరా కొనసాగుతుండటంతో చిన్న గాలి వీచినా, స్వల్ప వర్షం కురిసినా మూడు ఫేజ్ విద్యుత్ రెండు నుంచి మూడు రోజుల పాటు నిలిచిపోతోందని రైతులు వాపోతున్నారు.
రోజుకు కనీసం 15 నుంచి 20 సార్లు లైన్ ట్రిప్పింగ్, బ్రేక్‌డౌన్‌లు జరుగుతుండటంతో వ్యవసాయ మోటార్లు సరిగా పనిచేయడం లేదని, పంటలకు సకాలంలో నీరు అందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాలు ఉచిత పథకాలు ప్రకటించడమే కాకుండా, కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలు, వైర్లు, ఇతర మౌలిక వసతులను ఆధునీకరించడంపై కూడా దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. పాత విద్యుత్ లైన్ల స్థానంలో కొత్త స్తంభాలు, నాణ్యమైన వైర్లు ఏర్పాటు చేసి, నిరంతర మూడు ఫేజ్ విద్యుత్ సరఫరా అందిస్తే వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు అత్యవసరంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక రైతులు గిరిజన సంఘం నేత సుంకే నాయక్వి జ్ఞప్తి చేస్తున్నారు.
