జగన్ బాటలో కూటమి!


 


జగన్ బాటలో కూటమి! 

--------------------------

       నిజం నిప్పులాంటిది, జగన్ ముందుచూపుకు, దార్శిని కథకు నిదర్శనమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట నేడు కూటమి ప్రభుత్వం వాదనలు. 

     రాయలసీమ ఎత్తిపోతల పథకం,అత్యంత కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు చాలా అవసరమని,ఈరోజు కూటమి ప్రభుత్వం,బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడం బట్టి జగన్ కు ఉన్న ముందుచూపు, రాయలసీమ పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది.

     నిన్నటి వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరంలేదని, తెలంగాణ ప్రభుత్వానికి లాలూచీపడిన కూటమి నాయకులు ఈరోజు అదే పథకం ఎంతో అవసరమని వాదించవలసి వచ్చింది. ఇది రాయలసీమ ద్రోహం కాదా? 

    శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, నీటిని దిగువకు తరలించి ప్రాజెక్టును ఖాళీ చేస్తుండడం వల్ల, రాయలసీమ ఎత్తిపోతల అవసరం ఏర్పడింది.దీని విషయమై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.అయినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.మరో ప్రక్క జగన్ గారికి మంచి పేరు వస్తుందన్న దుర్బుద్ధితో లోపాయికారిగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ,పరోక్షంగా తెలంగాణకు చెందిన తమ వారితో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటి)లో రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపేయాలని కేసు వేయించిన కారణంగా ఎన్జీటీ స్టే ఇచ్చింది.ఇది ఏమాత్రం సమంజసం కాదని,ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదని, ఇప్పటికే నిర్మితమైన ఎస్ఆర్బిసి,తెలుగు గంగ, గాలేరు-నగరి, ప్రాజెక్టులకు గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ ఇచ్చిందన్న సందర్భాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి అవసరం లేదని అర్థమవుతుంది. అయినా గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లడం అంటే పక్క రాష్ట్రం తో లాలూచీ పడటం కాక మరేమిటి. 

    ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూ డి టి 1, కే డబ్ల్యూ డి టి2,పంపిణీ చేసిన కృష్ణా జలాలు,పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్ళించే 80 టీఎంసీలకు గాను నాగార్జున సాగర్ ఎగువన అదనంగా దక్కే 45 టీఎంసీల జలాలను ఆంధ్రప్రదేశ్,తెలంగాణలకు పంపిణీ చేయడంపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. 

    వర్షాభావ పరిస్థితుల్లోనే నీటిని క్యారీ ఓవర్ చేస్తామని కృష్ణా బేసిన్ లో 25% కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సంవత్సరాలలో ఉత్పన్నమయ్యే కరువు పరిస్థితులను అధిగమించడానికి నాగార్జునసాగర్ లో 90 టీఎంసీలు,శ్రీశైలంలో 60 టీఎంసీలు మొత్తం 150 టీఎంసీల క్యారీ ఓవర్ జలాలను ఉపయోగించుకునే హక్కును కృష్ణ,గోదావరి కమిషన్,కే డబ్ల్యూ డి టి 1, కే డబ్ల్యూ డి టి2, కల్పించాయి.

   75 శాతం నీటి లభ్యత కింద డబ్ల్యూ డి టి 1 కేటాయించిన 2130 టీఎంసీలకు అదనంగా కే డబ్ల్యూ డి టి2 కేటాయించిన 448 టీఎంసీలలో క్యారీ ఓవర్ నిలువల కోసం 65% లభ్యత కింద 30 టీఎంసీలు,సగటు ప్రవాహాల కింద 120 టీఎంసీలను కేటాయించింది.కేవలం జూన్,జూలై మాసాలలో అవసరాల కోసమే క్యారీ ఓవర్ నిల్వలను కేటాయించాలన్న తెలంగాణ ప్రతిపాదన సరైనది కాదు.శ్రీశైలం, నాగార్జున సాగర్లలో పూడిక వల్ల వాటి నిల్వ సామర్థ్యం తగ్గినంత మాత్రాన క్యారీ ఓవర్ నిల్వలను 150 నుండి 80 టీఎంసీలు తగ్గించకూడదు.మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను kwdt1 ఇచ్చింది. విభజన చట్టం 11వ షెడ్యూల్ లోని ప్రాజెక్టులకు మొదట జలాలు వాడుకోవచ్చు. 

    పోతిరెడ్డి పాడు పై ట్రిబ్యునల్ ఎటువంటి ఆంక్షలు విధించకూడదని,కే డబ్ల్యూ డి టి 1 ప్రకారం 811 టిఎంసిలకు పైన వచ్చే ప్రవాహాలను వాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కు హక్కుందని,చెన్నైకి త్రాగునీరు కోసం బేసిన్ పరిధిలోని ఏపీ,కర్ణాటక, మహారాష్ట్ర ఒక్కొక్కరు ఐదు టీఎంసీల చొప్పున ఇవ్వాలనే అంతరాష్ట్ర ఒప్పందాల నిబంధనలు ఉన్నాయి.70% లభ్యత నుంచి చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు,ఎస్సార్ బీసీ కి 19,మొత్తం 34 టీఎంసీలను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సరఫరా చేయాల్సి ఉంది.

     ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మిగులు జలాల ఆధారంగా పలు ప్రాజెక్టులను చేపట్టింది వాటికి కూడా నికర జనాలు కేటాయించాలి.

   కే డబ్ల్యు డిటి 2 సగటు ప్రవాహాల నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు 25 టీఎంసీలను కేటాయించింది,విభజన చట్టం 11వ షెడ్యూల్ లో తెలుగు గంగ,గాలేరు-నగరి ప్రాజెక్టులకు అనుమతి ఉంది.

    కృష్ణా వరద ఉధృతిని తగ్గించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కాలవ సామర్ధ్యాన్ని పెంచడం అనివార్యం.విభజన చట్టం ప్రకారం వరద నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రం పై ఉంది. ట్రిబ్యునల్ అవార్డులు, రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం నీటి ప్రవాహాలను నియంత్రించడం కృష్ణా బోర్డు విధి,అందువల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పై ట్రిబ్యునల్ ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉండదు. 

    రాయలసీమ ఎత్తిపోతల పథకం,పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ల ప్రాముఖ్యత ఇటు రాయలసీమకు,అటు వరద ముంపు ప్రాంతాలకు ఎంత ముఖ్యమో గ్రహించిన జగన్ క్యారీ ఓవర్ కింద రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు మూడు టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 88000 క్యూసెక్కులకు పెంచడం వల్ల రోజుకు 7 టీఎంసీలు మళ్లించడం ద్వారా రాయలసీమకు జరిగే ప్రయోజనాలను ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం,చంద్రబాబు నాయుడు తెలుసుకొని మన అవసరాలను పక్క రాష్ట్రాలకు పణంగా పెట్టకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడాలి