ప్రైవేటు స్కూల్ బస్సు ప్రమాదం... తృటిలో తప్పిన భారీ ప్రమాదం

డ్రైనేజీలోకి ఒరిగిన మంగళకర స్కూల్ బస్సు.. సురక్షితంగా బయటపడిన విద్యార్థులు.

గోరంట్ల, జూలై 29:గోరంట్ల సమీపంలో మంగళకర ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి రహదారి పక్కనున్న డ్రైనేజీలోకి ఒరిగిపోయిన ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న ముగ్గురు విద్యార్థులు, డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పుట్టపర్తి మండలం జగరాజుపల్లి కేంద్రంగా మంగళకర పాఠశాల నిర్వహిస్తున్నారు. గోరంట్ల పరిసర గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లేందుకు ఈ బస్సును ప్రతిరోజూ నడుపుతున్నారు. బుధవారం ఉదయం ఖాజాపురం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రహదారి పక్కనున్న డ్రైనేజీలోకి దూసుకెళ్లి ఒకవైపునకు ఒరిగిపోయింది.

ఆ సమయంలో బస్సులో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ప్రమాదంతో వారు కొద్దిసేపు భయాందోళనకు గురైనప్పటికీ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ కూడా క్షేమంగా బయటపడినట్లు సమాచారం

బస్సు అదుపుతప్పడానికి డ్రైవర్ నిర్లక్ష్యం లేదా అతివేగం కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా స్థానికులు భావిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను బయటకు తీసుకువచ్చేందుకు సహకరించారు.
బస్సులో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ఇదే ఘటనలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల బస్సుల నిర్వహణ, డ్రైవర్ల వేగ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు