– పాత్రికేయ విలువలను మంటగలుపుతున్న కొందరు నకిలీ జర్నలిస్టులు
పాత్రికేయ వృత్తి సమాజానికి దిక్సూచి. ప్రజల గొంతుకగా నిలిచి, ప్రభుత్వానికి–ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించడం జర్నలిస్టు బాధ్యత. అయితే నియోజకవర్గ పరిధిలోని కూడేరు మండలంలో కొందరు వ్యక్తులు ఈ పవిత్రమైన వృత్తిని అడ్డం పెట్టుకుని దానికే మాయని మచ్చగా మారుతున్నారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
వార్తలను ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, డబ్బు వసూలు చేసే సాధనంగా మార్చుకోవడం ఆందోళనకర పరిణామం. వార్తలు రాస్తామని బెదిరించడం, ప్రతికూల కథనాలు ప్రచురించకుండా ఉండేందుకు బేరసారాలు చేయడం, డిమాండ్లు నెరవేరకపోతే లక్ష్యంగా చేసుకుని వరుస కథనాలు ప్రచురించడం వంటి చర్యలు పాత్రికేయ విలువలను దిగజారుస్తున్నాయి.
ప్రజల పక్షాన నిలవాల్సిన కొందరు, రాజకీయ పార్టీల కనుసన్నల్లో పనిచేస్తూ ఏకపక్ష వార్తలను ప్రచారం చేయడం ద్వారా స్వతంత్ర పాత్రికేయానికి విఘాతం కలిగిస్తున్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తేవాల్సిన వారు రాజకీయ విధేయతను ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామం కాదు.
చిన్నపాటి ఆరోపణలనే ఆయుధంగా మార్చుకుని అధికారులు, ఉద్యోగులను బెదిరించడం, పత్రికలు–పాత్రికేయుల ముసుగులో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఐకేపీ, రెవెన్యూ, ఎంపీడీవో, ఉపాధి హామీ తదితర కార్యాలయాల సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఒత్తిడి తీసుకురావడం కూడా చర్చనీయాంశమవుతోంది.
పెద్ద మీడియా సంస్థలను మినహాయిస్తే, చిన్న పత్రికల్లో పనిచేసే చాలామంది పాత్రికేయులకు తగిన వేతనాలు లేకపోవడం వాస్తవమే. అయితే అది అక్రమార్జనకు, బ్లాక్‌మెయిలింగ్‌కు లేదా అవినీతికి సమర్థన కాలేదు. ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపి వృత్తి ధర్మాన్ని పణంగా పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు.
"కంచె చేను మేస్తే... కాచేది ఎవరు?" అన్న సామెతను గుర్తు చేసే పరిస్థితులు నెలకొనడం విచారకరం. ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన వారే దానిని దెబ్బతీస్తే, సమాజం మొత్తం పాత్రికేయ వృత్తిపైనే అనుమానంతో చూసే ప్రమాదం ఉంది.
నిజాలను నిర్భయంగా వెలుగులోకి తేవడమే నిజమైన జర్నలిజం. ఆధారాలతో, నిష్పాక్షికంగా ప్రజా సమస్యలను వెలికితీయడమే పాత్రికేయుడి ధర్మం. కానీ ఏకపక్ష వార్తలు, రాజకీయ పక్షపాతం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కథనాలు రాయడం జర్నలిజం విలువలను దిగజార్చడమే.
పవిత్రమైన ఈ వృత్తి గౌరవాన్ని కాపాడటం ప్రతి పాత్రికేయుడి బాధ్యత. వృత్తి ధర్మాన్ని నిలబెట్టి, ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మీడియా సంస్థలు, పాత్రికేయ సంఘాలు, బాధ్యతగల జర్నలిస్టులు కలిసి చర్యలు చేపట్టాల్సిన అవసరం నేటి పరిస్థితుల్లో ఎంతైనా ఉంది.
