అన్నీ అబద్ధాలు అర్థ సత్యాలే!
12 సంవత్సరముల టిడిపి పాలనలో ప్రాజెక్టుల ప్రగతి ఏమైంది?
--------------------------
ఆంధ్ర ప్రదేశ్ జలవనురుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేసిన జలవనరుల శ్వేత పత్రం నిండా అబద్ధాలు, అర్థసత్యాలు,వైకాపా మీద నీలాపనిందలు.అందుకే ఇది ముమ్మాటికీ రాజకీయ పత్రమే.
40 సంవత్సరముల ఇండస్ట్రీ,నాలుగు పర్యాయాలు,12 సంవత్సరముల ముఖ్యమంత్రి,రెండున్నర సంవత్సరములు పాలించిన పసికూన వైకాపా పై నీలాప నిందలు వేసి తాము తప్పించుకునే ఎత్తుగడ.
2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 34.5% గా ఉన్న సాగు నీటి సౌకర్యాన్ని 61% శాతానికి పెంచాలని చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి ని గురించి మాట్లాడే దమ్ము లేక,కేవలం రెండు సంవత్సరాలకు సంబంధించిన ప్రగతి పత్రాన్ని విడుదల చేసి,పది సంవత్సరముల చీకటి పాలనను మరిపింప జేసే కుట్రలో భాగమే ఈ శ్వేత పత్రం.అందుకే ఇది నిమ్మకు నీరెత్తిన నిమ్మల రాజకీయపత్రం అంటాను.
3000 కోట్లతో హంద్రీ-నీవా లో అంతర్భాగమైన మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ, పేరూరు బ్రాంచ్ కెనాల్ నిర్మాణం,అప్పర్ పెన్నా, బైరవాన్ని తిప్ప కాలువ, మూలపల్లి నుండి కళ్యాణి డ్యాం,కుప్పం నుండి గుడిపల్లి రిజర్వాయర్ పనులను చేస్తున్నామని చెబుతున్న అంశాలను కనబరిచినప్పుడు ఆ పనుల టెండర్లు మీకు సంబంధించిన గుత్తేదార్లకు 4.85% ఎక్సర్సిస్ కు కట్టబెట్టామన్న విషయాన్ని ఎందుకు పొందుపరచలేదు?
అంతకు మునుపు 3,850 కోట్లు ఖర్చు పెట్టి మొదటి దశ వెడల్పు, రెండవ దశ లైనింగ్ పనులు పూర్తి చేసి 60 టీఎంసీల నీళ్లు తెచ్చామని ఆర్థిక శాఖ మంత్రి,నేడు శ్వేత పత్రంలో 55 టిఎంసిలు తెచ్చామని జలవనురుల శాఖామంత్రి చెబితే,ప్రభుత్వ అధికారులు 51 టిఎంసిలు మాత్రమే వచ్చాయని చెబుతున్నారు,ఏది నిజమో శ్వేత పత్రంలో క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోయారు? దీనిని బట్టే ఈ శ్వేత పత్రం అబద్ధాల పుట్ట అని అర్థమవుతుంది.
హంద్రీ-నీవా పనులలో జరిగిన అవినీతి పై సిబిఐ విచారణకు సిద్ధమా? అంత డబ్బు ఖర్చు పెట్టిన మీరు ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చారా? కనీసం వచ్చిన నీళ్లు ఎక్కడికి పోయాయో చెప్పగలరా? చెప్పలేదు అంటే ఈ పనులన్నీ కాంట్రాక్టర్లకు,మీ కమీషన్ల కోసం అని ఎందుకు అనకూడదు?
వెలిగొండ ప్రారంభించింది మీరు,90 శాతం పూర్తి చేసింది వైసిపి,ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునే విధంగా శ్వేత పత్రం, ఇదెక్కడి చోద్యం.
2014-19 మధ్య 68 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇందులో రాయలసీమ ప్రాజెక్టులకే 12 వేల కోట్లు ఖర్చు చేశామని,ఈ రెండేళ్లలోనే ప్రాజెక్టులకు 24,611కోట్లు ఖర్చు చేస్తే ఇందులో రాయలసీమ ప్రాజెక్టులకే 12,484 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న ఈ శ్వేత పత్రంలో,ఎన్ని ఎక రాలకు నీళ్లు ఇచ్చాము, ఎంత పంట పండించాము అన్న విషయాలు పొందుపరచక పోవడం బట్టి ఇవి నీరు పారించే ప్రాజెక్టులు కాదు,డబ్బులు పారించే ప్రాజెక్టులని అంగీకరించినట్లు అయింది.
పోలవరం 72% పూర్తి చేశాం అంటున్నారు, విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టును బహుళార్థ సాధక ప్రాజెక్టుగా కేంద్రమే నిర్మించాలి,అలాంటిది నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అయిన మీరు ఎందుకు మేమే నిర్మిస్తామని చెప్పడం,ఆ సందర్భంగా పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం గా మార్చుకున్నారని ప్రధానమంత్రి చెప్పిన మాటలను ఎందుకు శ్వేత పత్రంలో కనబరచలేదు?
వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇంత ఆలస్యం రావడానికి కారణం మీరు కాదా? కేంద్రంతో లాలూచీపడి 45.72మీటర్ల ఎత్తు నుండి 41.15 మీటర్లకు తగ్గించి చెక్ డామ్ గా మార్చేసి పోలవరం గొంతు నులిమింది మీరు కాదా? పట్టిసీమ నీళ్లు రాయలసీమ కని 2015 నుండి ఇప్పటివరకు సుమారు 450 టీఎంసీలు మూడు పంటలు పండుతున్న కోస్తా డెల్టా ప్రాంతానికి మళ్ళించి,రాయలసీమకు మోసం చేసిన విషయం కూడా పొందుపరచాలి కదా ?పోలవరం పూర్తి అయ్యి కృష్ణా డెల్టాకు నీటిని మళ్లిస్తే,శ్రీశైలం నుంచి నీటిని రాయలసీమకు తీసుకోవడంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైకాపా ప్రారంభిస్తే తెలంగాణ ముఖ్యమంత్రితో లాలూచీపడి ఆపేసిన విషయం శ్వేత పత్రంలో ఎందుకు లేదు? భవిష్యత్తులో పోలవరంలో లో ఆదా అయ్యే నీటిని రాయలసీమకు ఏ విధంగా మళ్లిస్తారో వేతపత్రంలో వివరించాలి కదా?
వెలుగొండ ప్రాజెక్టుకు ఏ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో శ్వేత పత్రంలో ఎందుకు పొందుపరచలేదు? పనులు పూర్తికాకనే జాతికి అంకితమిచ్చింది మీరు కాదా? నిర్వాసితులకు చెల్లించవలసిన పరిహారం 600 కోట్లు చెల్లించుకనే ఈ ఏడాది సెప్టెంబర్ కు నీళ్లు ఇస్తామని చెప్పడం నిర్వాసితుల పుట్టి ముంచడానికి కాదా?
36 ప్రాజెక్టు లు పూర్తి చేస్తామంటున్నారు అయితే వాటి పేర్లను చెప్పగలరా, 623 ఎత్తిపోతల పథకాలకు పునరుజ్జీవం పోశామని చెబుతున్న మీరు ఎన్ని ఎకరాల ఆయకట్టు స్తిరీకరించబడిందో చెప్పకుండా నిమ్మకు నీరె త్తినట్లు నిండుగా అబద్ధాలు చదివితే శ్వేత పత్రం అయిపోదు.
