-నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: జివిఎస్ఎస్ డిమాండ్
ఉరవకొండ:
ఉరవకొండ నియోజకవర్గంలో జిఓ నంబర్ 1ను తుంగలో తొక్కి, విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని (GVSS) రాష్ట్ర ఉపాధ్యక్షులు సాకే పురుషోత్తం డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పాఠశాలల్లో కనీస మౌలిక వసతులైన ఆటస్థలాలు (ప్లే గ్రౌండ్), సైన్స్ ల్యాబ్‌లు, సరిపడా మరుగుదొడ్ల సౌకర్యాలు లేకపోయినప్పటికీ, ఉన్నట్లు చూపిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ యాజమాన్యాలు లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా బిల్డింగ్‌లపై బిల్డింగ్‌లు నిర్మిస్తూ విద్యార్థుల భద్రతను సైతం పక్కనబెట్టి పాఠశాలలను నడుపుతున్నారని ఆరోపించారు.
ఈ సమస్యలపై పలుమార్లు స్థానిక ఉరవకొండ మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ నిబంధనలు పాటించకుండా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్న పాఠశాల యాజమాన్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ విషయమై అనంతపురం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ)లకు ఫిర్యాదు చేయనున్నట్లు సాకే పురుషోత్తం స్పష్టం చేశారు.
