అనంతపురం పీటీసీలో ఎస్‌సీటీపీసీ 2025–26 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్

అనంతపురం: నగరంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పీటీసీ) పరేడ్ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీల (సివిల్) 2025–26 బ్యాచ్ పాసింగ్‌ ఔట్ పరేడ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ట్రైనీ కానిస్టేబుళ్లు క్రమశిక్షణతో నిర్వహించిన పరేడ్ ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి మంత్రి పయ్యావుల కేశవ్ గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో విధులు నిర్వహించడం గౌరవంతో పాటు ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఖాకీ యూనిఫాం ధరించిన ప్రతి పోలీసు అధికారి ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సానుభూతితో పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.

శిక్షణ కాలంలో పొందిన జ్ఞానం, క్రమశిక్షణ, శారీరక సామర్థ్యాలను విధి నిర్వహణలో సమర్థంగా వినియోగించాలని మంత్రి సూచించారు. చట్టాన్ని గౌరవిస్తూ, ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించడం ద్వారా పోలీసు శాఖపై మరింత నమ్మకం పెంచాలని పేర్కొన్నారు.

పాసింగ్‌ ఔట్ పరేడ్ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లలో ఉత్సాహం నెలకొంది. శిక్షణలో నేర్చుకున్న కవాతు, శారీరక దారుఢ్యం, పోలీసు విధులకు సంబంధించిన అంశాలను ప్రదర్శించారు.

కార్యక్రమానికి పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు, పీటీసీ అధికారులు, శిక్షకులు, సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు. శిక్షణను పూర్తి చేసుకుని విధుల్లోకి అడుగుపెడుతున్న సిబ్బందికి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.