ఉరవకొండ ,సెప్టెంబర్ 23:ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న పి. భోగన గౌడ్ తీరుపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కుల, ఆదాయ, రెవెన్యూ ధ్రువీకరణ పత్రాలు, ఇతర అత్యవసర పనుల కోసం కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే సామాన్య ప్రజలకు ఈ అధికారి దర్శన భాగ్యం కలగకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నా పనులు కాక, సమయం, డబ్బు వృథా అయి తీవ్ర అవస్థలు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు.
హాజరు రిజిస్టర్‌లో గోల్ మాల్.. సొంత రాజ్యమా?
అంతేకాకుండా, ప్రభుత్వ సర్వీసు నిబంధనలను బొందపెడుతూ కార్యాలయ హాజరు రిజిస్టర్‌లో సైతం దర్జాగా ఖాళీలు వదిలేస్తున్నారనే దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజులుగా హాజరు కాలమ్‌లలో సంతకాలు లేకపోవడం, రిజిస్టర్ ఖాళీగా ఉండటం ఈ అధికారి నిర్లక్ష్యానికి, అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'మీకోసం' (ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమాలకు సైతం ఈ అధికారి గైర్హాజరు కావడం ప్రభుత్వ ఆశయాలనే ఎద్దేవా చేయడమేనని స్థానికులు మండిపడుతున్నారు.
ఉన్నతాధికారులు కన్ను తెరవాలి.. సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేయాలి!
ప్రజాసేవను పక్కనబెట్టి, కార్యాలయానికి రాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ భోగన గౌడ్ తీరుపై జిల్లా సహచ కార్యదర్శి మీనుగ మధు బాబుతో పాటు స్థానిక ప్రజలు, లబ్ధిదారులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నిర్లక్ష్య వైఖరిపై అనంతపురం జిల్లా కలెక్టర్, సంబంధిత ఆర్డీఓ తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా సహచ కార్యదర్శి మధు బాబు గట్టిగా డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై ఉక్కుపాదం మోపి, ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
