గుంతకల్లు-ఉరవకొండ-తుమకూరు రైల్వే లైన్ పనులు వెంటనే ప్రారంభించాలి


అనంతపురం: గుంతకల్లు నుంచి ఉరవకొండ మీదుగా తుమకూరు వరకు ప్రతిపాదించిన రైల్వే మార్గానికి సంబంధించిన పనులను త్వరితగతిన చేపట్టాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్‌లో బస చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ను పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి మూడ్ కేసవ్ నాయక్ మాట్లాడుతూ.. అత్యంత వెనుకబడిన ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి రైల్వే కనెక్టివిటీ ఎంతో కీలకమని అన్నారు. గుంతకల్లు నుంచి ఉరవకొండ మీదుగా తుమకూరు వరకు రైల్వే మార్గం ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
ఈ రైల్వే మార్గం కోసం గతంలో కూడా పలుమార్లు వినతులు అందజేసిన విషయాన్ని కేసవ్ నాయక్ గుర్తుచేశారు. ఈ సమస్యను కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రాజెక్టుకు సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని పి.వి.ఎన్. మాధవ్‌ను కోరారు.
ప్రస్తుతం తుమకూరు–రాయదుర్గం కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులో పలు విభాగాల్లో పనులు కొనసాగుతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. 2026 జూలైలో రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న ఉరుకెరె–కోరటగెరె, కోరటగెరె–మడకశిర విభాగాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు.
ఈ నేపథ్యంలో ఉరవకొండ ప్రాంతానికి మరింత మెరుగైన రైల్వే కనెక్టివిటీ కల్పించేలా ప్రతిపాదిత మార్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాయకులు కోరారు.
వారి వినతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. ఈ అంశాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కె. లాలెప్ప, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గణేష్ తదితరులు పాల్గొన్నారు.