కడపను ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

 ఇన్వెస్ట్ కడప’ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

పెట్టుబడిదారులకు భూమి, నీరు, విద్యుత్, రహదారులు, అనుమతులపై ఒకే వేదికగా సేవలు

కడప, సెప్టెంబర్ 9: కడప జిల్లాను దక్షిణ భారతదేశంలోనే ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘ఇన్వెస్ట్ కడప’ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.

బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ‘ఇన్వెస్ట్ కడప’ కేంద్రాన్ని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, సబ్ కలెక్టర్ హెచ్‌.ఎస్‌. భావనతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెట్టుబడిదారులకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్, రహదారులు, అనుమతులు తదితర అంశాల్లో ఒకే వేదిక ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. పెట్టుబడి ఆలోచన నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తామని చెప్పారు.

జిల్లాలో అందుబాటులో ఉన్న భూములు, వనరులు, మౌలిక వసతులకు సంబంధించిన వివరాలను డిజిటల్ వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. గత ఐదేళ్లకు సంబంధించిన గణాంకాలను కూడా ఒక్క క్లిక్‌తో తెలుసుకునే విధంగా ‘ఇన్వెస్ట్ కడప’ను రూపొందించినట్లు వివరించారు.

పరిశ్రమలతో పాటు పునరుత్పాదక ఇంధనం, గనులు–ఖనిజాలు, పర్యాటకం, వాణిజ్యం తదితర రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు

జిల్లాలో పెట్టుబడులు పెరగడంతో స్థానిక యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, పెట్టుబడులు పెంచి ఆర్థిక అభివృద్ధికి ఊతమివ్వడమే ‘ఇన్వెస్ట్ కడప’ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.