రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా భగత్ సింగ్ జయంతి

 

రాయదుర్గం, సెప్టెంబర్ 28: రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షహీద్ భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. AISF, AIYF ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నగేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో AISF, AIYF అనంతపురం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, AIYF రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కావలి కోట్రేష్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ భారత స్వాతంత్ర్యోద్యమంలో యువతను బలంగా ప్రభావితం చేసిన ప్రముఖ విప్లవకారుడని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్‌లోని బంగా ప్రాంతంలో జన్మించారని తెలిపారు. చిన్న వయసులోనే బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలోకి ప్రవేశించి, హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA)లో కీలక పాత్ర పోషించారని వివరించారు.

1929లో ఢిల్లీ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో జరిగిన బాంబు ఘటన అనంతరం భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్‌లను అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం లాహోర్ కుట్ర కేసులో భగత్ సింగ్‌కు ఉరిశిక్ష విధించగా, 1931 మార్చి 23న రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లతో కలిసి ఆయన అమరుడయ్యారని తెలిపారు.

భగత్ సింగ్ దృష్టిలో స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదని, సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగి దోపిడీ లేని సమాజం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారని నాయకులు పేర్కొన్నారు. యువతలో ప్రశ్నించే తత్వం, పఠనాశక్తి, సామాజిక చైతన్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం యువత చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. “ఇంక్విలాబ్ జిందాబాద్”, “భగత్ సింగ్ అమర్ రహే” అంటూ నినాదాలు చేశారు.

కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు శ్రీనివాస్, ఎర్రన్న, గోవింద్‌తో పాటు AISF, AIYF నాయకులు భాను ప్రకాష్, కుమార్ నాయక్, నవీన్, రాజు, తరుణ్, నందు తదితరులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.