పాత పనులకు కొత్త సున్నం.. వాటర్‌షెడ్‌ పనుల్లో రూ.15 లక్షల అక్రమాలు


పాత పనులకు.. కొత్త సున్నం

వాటర్‌షెడ్‌ పథకంలో అక్రమాలు.. రూ.7.91 కోట్లతో 410 పనులు

రాయదుర్గం: భూగర్భ జలాల పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై)-2.0లో అక్రమాలు వెలుగుచూశాయి. 2024-26 కాలానికి సంబంధించి రూ.7.91 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 410 పనుల్లో పలు అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర క్వాలిటీ కంట్రోలర్ బృందం తనిఖీల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఈ పథకం కింద చెక్‌డ్యామ్‌లు, డగౌట్ పాండ్లు, రాతి కట్టడాలు, నీటి కుంటలు, ఫారంపాండ్లు, ఊట కుంటలు తదితర పనులను చేపట్టారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని గోళ్ల ప్రాజెక్టు పరిధిలో బోరంపల్లి, గోళ్ల , పలుగ్రామాల్లో, రాయదుర్గం మండలంలోని డి.కొండాపురం పరిధిలో డి.కొండాపురం, గ్రామదట్ల, టి.వీరాపురం గ్రామాల్లో పనులు నిర్వహించారు.

పాత పనులకే కొత్తగా బిల్లులు?

రాష్ట్ర క్వాలిటీ కంట్రోలర్ బృందం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా కొన్ని చోట్ల ఇప్పటికే ఉన్న పాత పనులకే కొత్తగా రంగులు వేసి, వాటిని కొత్త పనులుగా చూపించి బిల్లులు పొందినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మొత్తం రూ.15 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు అధికారులు నిర్ధారించినట్లు పేర్కొంటున్నారు.

అందులో టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.7.50 లక్షలు, ప్రాజెక్టు అధికారిణికి రూ.3.75 లక్షలు, జూనియర్ ఇంజినీర్‌కు రూ.3.75 లక్షల మేర వాటాలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

120 పనుల పరిశీలన

క్షేత్రస్థాయిలో మొత్తం 120 పనులను పరిశీలించిన అనంతరం నిర్వహించిన బహిరంగ ప్రజావేదికలో రూ.31,725 మాత్రమే రికవరీగా చూపినట్లు సమాచారం. అలాగే రూ.8.84 లక్షల విలువైన పనులను తిరిగి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

అయితే అక్రమాలుగా గుర్తించిన మొత్తంతో పోలిస్తే రికవరీ తక్కువగా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాత పనులకు కొత్తగా బిల్లులు చేసిన వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయి వివరాలు వెల్లడించాల్సి ఉంది.