అన్ని స్థానాల్లో ఎంపీటీసీ, జడ్పిటిసిలలో పోటీ చేయడానికి బీఎస్పీ సర్వం సిద్ధం :చిందనూరు నాగరాజు
నిండు మనసులతో తమ బీఎస్పి నేతలను ఆశీర్వదించాలని విజ్ఞప్తి
కూటమి నేతల మోసాలకు ప్రజలు ఈ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని పిలుపు
మీ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుపై బలంగా నొక్కి గట్టి మద్దతు తెలిపి తమ నేతలను ఆశీర్వదించండి
బీఎస్పీ బలగం బరిలోకి.. ఏనుగు గుర్తుపై గెలుపు రథం!
అదే జోరులో రాయదుర్గం రూరల్ జెడ్పిటిసి అభ్యర్థిగా దాసరి రేణుక, కనేకల్ మండల జెడ్పిటిసి అభ్యర్థిగా సూరం రాజశేఖర్ రెడ్డి కూడా తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ విషయాన్ని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు వెల్లడించారు. గొల్ల రాజేశ్వరిని జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా చిందనూరు నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి గద్దల నాగభూషణం, జిల్లా అధ్యక్షులు కాసాని నాగరాజు ప్రకటించారు.
మీడియాతో మాట్లాడుతూ చిందనూరు నాగరాజు మాటల్లో ధీటు స్పష్టంగా కనిపించింది. తమ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపిస్తే వ్యవసాయం, నీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి రైతన్నలకు అండగా నిలుస్తామని ఆయన మాటిచ్చారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టి స్థానిక ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చూస్తామని, మహిళా స్వయం సహాయక సంఘాలకు మద్దతు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి కోసం రోడ్లు, మంచినీటి సౌకర్యాలు, వీధి దీపాలను మెరుగుపరుస్తామని, ప్రజలకు పారదర్శక పాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.కూటమి ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ రెండున్నర ఏళ్లలో కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయకుండా ప్రజలందరినీ మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుపై బలంగా నొక్కి తమ నేతలను ఆశీర్వదించి పారదర్శక పాలనకు మద్దతు తెలపాలని ఆయన ఉద్వేగంగా పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలన్నింటిలో పోటీ చేయడానికి బీఎస్పీ సర్వం సిద్ధమైందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


