ఆర్థిక ఇబ్బందులతో తుల్జా భవానీ ఉత్సవాలకు దూరం
ఐదు తండాల సమావేశంలో కీలక నిర్ణయం.. నంగరే నాయక్‌లో ఈ ఏడాది వేడుకలు లేవు
వజ్రకరూరు: యావత్ గోర్ బంజారా సమాజానికి ఆరాధ్య దైవంగా భావించే శ్రీ తుల్జా భవానీ అమ్మవారి ఆశీస్సులతోనే బంజారా సంతతి పురోభివృద్ధి సాధిస్తోందని ఆ వర్గాల ప్రజలు విశ్వసిస్తారు. ఘన చరిత్ర కలిగిన బంజారాలు ఏటా విజయదశమి పర్వదినాన తుల్జా భవానీ ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే కాలక్రమేణా కరువు, అతివృష్టి, అనావృష్టి వంటి పరిస్థితులతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటంతో కొన్ని ప్రాంతాల్లో ఈ ఉత్సవాలను మూడు లేదా ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది.
ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పాటు పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరిగిందని స్థానికులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పండుగ నిర్వహణపై తండాల ప్రజలు చర్చించారు.
“కష్టమైనా.. లాభమైనా.. శుభమైనా.. అశుభమైనా ఐక్యంగానే మెలగాలి” అనే పూర్వీకుల సిద్ధాంతాన్ని పాటిస్తూ నిర్ణయం తీసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో మంగళవారం వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండా పంచాయతీ పరిధిలోని రచ్చకట్ట వద్ద ఐదు తండాలకు చెందిన బంజారా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సమావేశమయ్యారు. బంజారా సంఘం జాతీయ నేత ఎస్.కె. కేశవ నాయక్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
సమావేశంలో ప్రస్తుత గ్రామీణ పరిస్థితులు, వర్షాభావం, పంటల పరిస్థితి, ప్రజల ఆర్థిక ఇబ్బందులు, తుల్జా భవానీ ఉత్సవాల నిర్వహణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ ఏడాది తీవ్ర వర్షాభావం, ఆర్థిక సమస్యల కారణంగా పండుగ నిర్వహణకు సమావేశానికి హాజరైన 96 మందిలో అత్యధికులు ఆసక్తి చూపలేదని నిర్వాహకులు తెలిపారు. ప్రజల అభీష్టం మేరకు ఈ ఏడాది తుల్జా భవానీ పండుగ వేడుకలకు దూరంగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ మేరకు నంగరే నాయక్ ఆధ్వర్యంలో ఈ ఏడాది తుల్జా భవానీ పండుగ వేడుకలు నిర్వహించకూడదని అధికారికంగా తీర్మానం చేసినట్లు తెలిపారు.
ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత భవిష్యత్తులో ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. పండుగ కంటే ప్రజల ఆర్థిక పరిస్థితులు, కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.

