కురుబలకు ఏజెంట్ పదవి కేటాయించాలని విజ్ఞప్తి
మఠానికి కురుబ వంశీకులు 56.30 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారని వెల్లడి
ఏసీ బోయపాటి సుధారాణికి దరఖాస్తు అందజేత
ఉరవకొండ (ట్రూ టైమ్స్ ఇండియా), నవంబర్ 17: 770 మఠాలకు మూలపీఠమైన ప్రసిద్ధ ఉరవకొండ గవి మఠం సంస్థానం 'ఏజెంట్' పదవి రేసులో బీజేపీ నేత లాలెప్ప నిలిచారు. ఈ పదవి కోసం ఆయన మంగళవారం జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) మరియు మఠం మేనేజర్ బోయపాటి సుధారాణిని స్వయంగా కలిసి తన దరఖాస్తును అందజేశారు.
ఈ సందర్భంగా లాలెప్ప మాట్లాడుతూ, తాము తరతరాలుగా శివారాధకులమని పేర్కొన్నారు. గతంలో తమ కురుబ వంశీకులు మఠం అభివృద్ధి కోసం అత్యంత విలువైన 56.30 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారని, నేడు ఆ భూమి విలువ కోట్లాది రూపాయలు పలుకుతోందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గవి మఠం ఏజెంట్ పదవిని కురుబ సామాజిక వర్గానికి కేటాయించేలా తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను అభ్యర్థించారు.
లాలెప్ప దరఖాస్తును స్వీకరించిన ఏసీ సుధారాణి స్పందిస్తూ, వినతిని పరిశీలించి తదుపరి చర్యల నిమిత్తం దేవాదాయ శాఖ కమిషనర్‌కు పంపిస్తామని తెలిపారు. కాగా, ప్రస్తుతం గవి మఠం జగద్గురు పీఠం ఉత్తరాధికారి ఎంపికపై ఇద్దరి మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో, పీఠాధిపతి నియామక ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయనకు సహాయకారిగా ఏజెంట్‌ను నియమించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

