ఎస్వీయూ పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ ధర్నా.. తిరుపతిని రాజధానిగా చేయాలన్న డిమాండ్
తిరుపతి: రాష్ట్రంలోని వివిధ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులందరికీ నెలకు రూ.5 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు అందించాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన చింతామోహన్ పలు రాజకీయ, సామాజిక అంశాలను ప్రస్తావించారు. ఎస్వీయూ గుర్తుకు వచ్చినప్పుడల్లా తిరుపతిని రాజధానిగా చేయాలన్న గత డిమాండ్లు గుర్తుకొస్తాయని అన్నారు. 1953లో తరిమెల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి తదితర నాయకులు తిరుపతిని రాజధానిగా చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. అయితే రాజధానికి బదులుగా ఎస్వీయూను ఏర్పాటు చేశారని తెలిపారు. అప్పట్లో తిరుపతిని రాజధానిగా ప్రకటించి ఉంటే నగరం మరింత అభివృద్ధి చెందేదని అభిప్రాయపడ్డారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో తిరుపతి రాజధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎస్వీయూలో విద్యనభ్యసించిన చంద్రబాబు నాయుడు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా విశ్వవిద్యాలయానికి ఏమి చేశారని చింతామోహన్ ప్రశ్నించారు. విద్యార్థులకు కనీసం పెన్ను, పుస్తకం కూడా అందించారా అని విమర్శించారు.
రాష్ట్రంలో సామాన్య ప్రజలకు కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన స్థలం కూడా అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయని, శ్మశాన వాటికల కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు కోటీశ్వరులకు లక్షల ఎకరాల భూములు కేటాయించారని చంద్రబాబుపై విమర్శలు చేశారు. రాయలసీమలో కివీ, మామిడి పండ్ల సాగు పేరుతో 90 వేల ఎకరాల భూమిని ఒక సంపన్న వ్యక్తికి కట్టబెట్టారని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల అందుబాటులో కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీతో పాటు తన పాత్ర కూడా ఉందని చింతామోహన్ పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి, తేజోవేతి, సమీవుల్లా, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

