అనంతపురం అర్బన్, ఏప్రిల్ 21: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు చేసిన ముందస్తు అడ్మిషన్ ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ AISF ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ, జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ఇప్పటికే ముందస్తు అడ్మిషన్ ఫ్లెక్సీలను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు సాధారణంగా జూన్‌లో ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ముందుగానే ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయని AISF నేతలు ఆరోపించారు.
ఇన్ఫినిటీ, ద న్యూ హారిజాన్, బి.ఎస్. ఇంటర్నేషనల్, సంసిద్ వంటి పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
విద్యాశాఖ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటిని సీజ్ చేయాలని AISF నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థి సంఘాలే స్వయంగా ఫ్లెక్సీలను తొలగిస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ నిబంధనలను అమలు చేయడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థి సంఘం నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో AISF నగర అధ్యక్షుడు మంజునాథ్, జిల్లా సహాయ కార్యదర్శి చందు, బాబ్జాన్, ఆఫాన్, సుసురుత్, తేజ తదితరులు పాల్గొన్నారు.
