పంచాయతీ రేసులో విశ్రాంత పోలీస్ అధికారి.ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల బరి హీటెక్కుతోంది. సుమారు 55 వేల పైచిలుకు జనాభా కలిగిన ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు, ఆశావహులు ముందస్తు వ్యూహాలతో రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రాజకీయ సమీకరణాలు, అభ్యర్థుల రేసుపై ఒక ప్రత్యేక విశ్లేషణ.
ప్రస్తుతం ఉరవకొండ పంచాయతీ పోరులో అందరి దృష్టి ఇటీవల పదవీ విరమణ చేసిన ఒక మాజీ పోలీస్ సర్కిల్ అధికారిపైనే ఉంది. ఆయనకు స్థానికంగా బలమైన పట్టు ఉండటమే కాకుండా, ప్రజలతో మమేకమై సేవ చేయడంలో మంచి గుర్తింపు ఉంది. ఉరవకొండ నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం తర్వాత అత్యధిక జనాభా కలిగిన మైనారిటీ వర్గానికి ఈయన చెందడం పెద్ద కలిసివచ్చే అంశం. సాంప్రదాయకంగా చేనేత వర్గం టీడీపీ వెంటే ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఈ విశ్రాంత పోలీస్ అధికారికి టీడీపీ అగ్ర నేత సోదరుల మద్దతు కూడా బలంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఈయన అభ్యర్థిత్వం దాదాపు ఖాయమనే ప్రచారం సాగుతోంది.
పోలీస్ అధికారితో పాటు టీడీపీ తరఫున సర్పంచ్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య గట్టిగానే ఉంది. ఇటీవల ఓ మైనారిటీ యువ నాయకుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, రోడ్డుకు ఇరువైపులా ఎండలో కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపారులకు గొడుగులు పంపిణీ చేసి ప్రజల్లో మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు. మరో మైనారిటీ నేత అయిన స్టాంప్ వెండర్ కమ్ రైటర్ కూడా సర్పంచ్ రేసులో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతానికి టీడీపీలో ముగ్గురు నేతలు పోటీ పడుతుండటంతో, అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు వైఎస్సార్‌సీపీ లేదా ఇతర ప్రత్యర్థి వర్గాల నుంచి కూడా గట్టి పోటీ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కొనకొండ్ల... శివరామిరెడ్డి ముఖ్య అనుచరుడైన ఆకుకూర నాగరాజు, ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తన ముందస్తు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గతంలో పోటీ చేసి ఓటమి పాలైన ఓ విశ్రాంత మహిళా శిశు సంక్షేమ అధికారిణి కూడా మళ్లీ ఈ వర్గం నుంచే పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే అనుచరుల నుంచి ఇప్పటివరకు సరైన అభ్యర్థి ఎవరనేది స్పష్టత రాలేదు.
అభ్యర్థుల జాబితా పెద్దదే ఉన్నప్పటికీ, ప్రజల్లో మాత్రం "పోలీస్ విశ్రాంత అధికారి అయితేనే పంచాయతీకి సరైనోడు" అనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. చివరకు రాబోయే ఎన్నికల్లో ఓటరు దేవుడు సామాజిక సమీకరణాలకా? పార్టీల ప్రభావానికా? అభ్యర్థుల వ్యక్తిత్వానికా? లేక వారు చేసే పనుల మేనిఫెస్టోకా? దేనికి ప్రాధాన్యత ఇస్తాడనేది కాలమే నిర్ణయించాలి. పంచాయతీ పీఠం ఎవరిని వరిస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.


