సేవాగఢ్ (పుణ్యక్షేత్రం):
దేశంలోని గోర్ బంజారాలందరినీ ఒకే తాటిపైకి తెచ్చి, వారి హక్కులు, సంస్కృతి పరిరక్షణే ధ్యేయంగా సాగుతున్న 'బంజారా ఏక్తా సంకల్ప యాత్ర' అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. కర్ణాటకకు చెందిన పూజ్యశ్రీ శ్రీ శ్రీ మహారాజ్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ సంకల్ప యాత్రలో భాగంగా.. ప్రముఖ బంజారా నాయకులు, మాజీ కేంద్ర మంత్రి ధరావత్ రవీంద్ర నాయక్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన సేవాగఢ్‌ను సందర్శించారు. ఆయన తో బాటు సుబ్రహ్మణ్యం నాయక్ పాల్గొన్నారు..
స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు
సేవాగఢ్ క్షేత్రానికి చేరుకున్న మాజీ మంత్రి రవీంద్ర నాయక్, కర్ణాటక శ్రీ శ్రీ మహారాజ్ మరియు ఇతర ముఖ్య నాయకులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్, జగదంబ మాతలకు వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి వేద ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాన్ని బహూకరించారు.
జాతి ఐక్యతే లక్ష్యం:
ఈ సందర్భంగా మాజీ మంత్రి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న బంజారా (గోర్) సమాజాన్ని ఏకం చేయడానికి కర్ణాటక శ్రీ శ్రీ మహారాజ్ చేపట్టిన ఈ 'ఏక్తా సంకల్ప యాత్ర' ఎంతో అభినందనీయమని కొనియాడారు. బంజారాల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ, సమాజంలో రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాల్లో రాణించాలంటే ఐక్యత ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ఈ రథయాత్ర విజయవంతంగా సాగుతుందని, దేశంలోని ప్రతి బంజారా తండాకూ ఈ ఐక్యతా సందేశం చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బంజారా సంఘాల ప్రతినిధులు, గిరిజన నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని యాత్రకు మద్దతు పలికారు.

