రెండు దశాబ్దాల కలను సాకారం చేసిన సీఎం చంద్రబాబు: 2003 డీఎస్సీ బాధితుల హర్షం




ఉరవకొండ, జూన్ 24:

సుమారు రెండు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని 2003 డీఎస్సీ బాధితుల సమస్యకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో తెరపడింది. మెమో నెంబర్ 57ను అమలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉరవకొండలోని కవిత హోటల్ సర్కిల్‌లో 2003 డీఎస్సీ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక కృతజ్ఞతా సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫోరం కన్వీనర్ కే. శేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, 2003 డీఎస్సీ ద్వారా ఎంపికై ఆలస్యంగా నియామకాలు పొందిన 7,300 మంది ఉపాధ్యాయులతో పాటు, ఇతర విభాగాలకు చెందిన 3,700 మంది ఉద్యోగులు సుదీర్ఘకాలంగా సీపీఎస్ (CPS) విధానంలో కొనసాగుతున్నారని గుర్తు చేశారు. వీరందరికీ పాత పెన్షన్ విధానం (OPS) వర్తింపజేయాలని, కేంద్ర ప్రభుత్వ మెమో 57ను అమలు చేయాలని కోరుతూ గత ప్రభుత్వాల వద్ద అనేకసార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యను సానుకూలంగా స్పందించి, రెండు దశాబ్దాల కలను నిజం చేశారని వారు కొనియాడారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 11,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాల్లో ప్రభుత్వం వెలుగులు నింపిందని హర్షం వ్యక్తం చేస్తూ 'థాంక్యూ సీఎం సార్' అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గురు ప్రసాద్, రామప్ప చౌదరి, ఆలూరు కృష్ణ, మహేష్ కుమార్, హరి, యుగంధర్, శ్రీదేవి తదితర ఫోరం సభ్యులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు బీసీ ఓబన్న, ఎం. శ్రీనివాసులు, సంజీవ, భువనేశ్వర్ చౌదరి, రఘు, ప్రసన్న కుమార్, సాకే మునిస్వామి, ఆది రాజేష్, లక్ష్మీనారాయణ, అజయ్, రెడ్డి లోకేష్, రాము మరియు మహిళా నాయకులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.