-ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో ఘనంగా ముగిసిన వేసవి శిక్షణా తరగతులు
ఉరవకొండ,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర గ్రంథాలయ శాఖ, అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో గత ఏప్రిల్ 28 నుండి నిర్వహిస్తున్న వేసవి శిక్షణా తరగతులు (సమ్మర్ క్యాంప్) శనివారంతో విజయవంతంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకలను గ్రంథాలయాధికారి వై. ప్రతాపరెడ్డి అధ్యక్షతన స్థానిక గ్రంథాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి
ప్రతాపరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నతనం నుంచే గ్రంథాలయాలకు రావడం అలవాటు చేసుకోవాలని, పుస్తక పఠనం ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పాలాక్షి మాట్లాడుతూ.. "చినిగిన చొక్కా అయినా తొడుక్కో - ఒక మంచి పుస్తకం కొనుక్కో" అనే కందుకూరి వీరేశలింగం గారి సూక్తిని గుర్తు చేస్తూ పుస్తకం యొక్క విలువను వివరించారు. పుస్తకం ఒక మంచి నేస్తమని, అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానమనే జ్యోతిని వెలిగించే అద్భుత సాధనమని కొనియాడారు. నేటి చరిత్రను భావితరాలకు అందించేవి పుస్తకాలేనని, ఈ అలవాటును చిన్నప్పటి నుంచే పెంపొందించుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు.
విజేతలకు బహుమతుల ప్రధానం:
వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం శిబిరంలో పాల్గొన్న పిల్లలందరికీ మిఠాయిలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్, రీసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు, గ్రంథాలయ పాఠకులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

