అనంతపురం జిల్లా సింగనమల నూతన సీఐ గా రాగిరి రామయ్య బాధ్యత లు స్వీకరించారు. నూతన సీఐ
ఘనంగా స్వాగతం పలికిన అవుట్‌గోయింగ్ సీఐ కొలుట్లయ్య.
పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇక్కడ సీఐగా విధులు నిర్వహించి, అనంతపురం వీఆర్ (VR) కు బదిలీ అయిన కొలుట్లయ్య.. నూతన సీఐ రామయ్యకు శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నూతన సీఐ రాగిరి రామయ్య మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదంతో అణచివేయడం తనకు కొట్టిన పిండని, ఎట్టిపరిస్థితుల్లోనూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
వివాదరహితుడు.. పేదల పక్షపాతి
రాగిరి రామయ్య పోలీస్ శాఖలో సుదీర్ఘమైన, సమర్థవంతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో ఆయన ఉరవకొండ, గుంతకల్లు, అనంతపురం తదితర ప్రాంతాల్లో ఎలాంటి వివాదాలు, అరమరికలు లేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందారు. ఆయా ప్రాంతాల్లో సేవలందించిన అనంతరం ఆయన పదోన్నతి (ప్రమోషన్) పై తిరుపతికి బదిలీ అయ్యారు. తాను పనిచేసిన ప్రతి చోటా పేదల పక్షాన నిలబడి, బాధితులకు న్యాయం చేస్తూ సేవాలందించడం ఆయన ప్రత్యేకత.
ఆర్టీసీ సెక్యూరిటీ ఆఫీసర్ నుండి సివిల్ సీఐ వరకు..
రాగిరి రామయ్య ప్రస్థానం ఎందరికో ఆదర్శనీయం. మొదట్లో ఆయన ఉరవకొండ ఏపీఎస్‌ఆర్‌టీసీ లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా తన విధులను ప్రారంభించారు. ఆ తర్వాత శాఖాపరమైన మార్పుల ద్వారా సివిల్ ఎస్ఐ (SI) గా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు. కష్టపడి పనిచేసే తత్వంతో, నిజాయితీతో పనిచేసిన ప్రతి చోటా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్, సొంత ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. శింగనమల సీఐగా బాధ్యతలు చేపట్టిన ఆయన నేతృత్వంలో నియోజకవర్గం మరింత ప్రశాంతంగా మారుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
