బెళుగుప్ప మండలంలోని ఎంపీపీ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై వనిత అనే ఉపాధ్యాయురాలు విచక్షణారహితంగా దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థిని వీపు, చేతులపై వాతలు పడేలా కొట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆ బాలిక భయంతో వణికిపోతూ, జ్వరంతో బాధపడుతోంది.
చట్టాన్ని ఉల్లంఘించిన వైనం.
విద్యార్థులపై భౌతిక దండన విధించడం చట్టరీత్యా నేరం. విద్యా హక్కు చట్టం మరియు బాలల హక్కుల పరిరక్షణ చట్టాల ప్రకారం పాఠశాలల్లో పిల్లలను శారీరకంగా హింసించడం పూర్తిగా నిషేధం. చట్టాలను అమలు చేయాల్సిన ఉపాధ్యాయురాలే, నియమాలను తుంగలో తొక్కి చిన్నారిపై దాడికి పాల్పడటం గమనార్హం.
*బాధిత తండ్రి ఆవేదన.. టీచర్ బెదిరింపులు.
తన కుమార్తెపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిని నిలదీయగా, సదరు ఉపాధ్యాయురాలు తనపైనే తిరగబడిందని బాలిక తండ్రి ఎం. హనుమంతనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ప్రశ్నించినందుకు, ఉపాధ్యాయుల యూనియన్ సభ్యులతో తనపై తప్పుడు కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారని ఆయన వాపోయారు. అయినా సరే, చట్టపరంగా పోరాడటానికి సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
అధికారుల జోక్యం కోసం డిమాండ్
ఘటనపై మండల విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి, బాధ్యులైన ఉపాధ్యాయురాలు వనితపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన ఉపాధ్యాయులే ఇలా హింసకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


