కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వరుసగా పెంచుతూ ప్రజలపై అదనపు భారాలు మోపుతోందని ఆరోపిస్తూ సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం ఉరవకొండ పట్టణంలోని కవిత హోటల్ సర్కిల్ వద్ద భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనలో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కేశవరెడ్డి, సీపీఎం జిల్లా నాయకుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరంతరం పెంచుతూ సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని మరింత భారంగా మారుస్తోందని విమర్శించారు. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధాలు తదితర కారణాలను సాకుగా చూపుతూ ధరల పెంపును సమర్థించడం సరికాదన్నారు. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విరమించుకోకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రాస్తారోకో కారణంగా కొంతసేపు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచి ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఉరవకొండ నియోజకవర్గ కార్యదర్శి చెన్నారాయుడు, సహాయ కార్యదర్శి నాగేంద్ర, నాయకులు మల్లేష్, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే సీపీఎం నాయకులు మధుసూదన్ నాయుడు, రంగారెడ్డితో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

