బాలల శారీరక, మానసిక వికాసానికి అంగన్‌వాడీలే పునాది: నిర్వాహకులు

Malapati
0


 


*విడపనకల్లు మండల పరిధిలోని పాల్తూరు గ్రామంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ ఆదేశాల మేరకు "అంగన్‌వాడి పిలుస్తోంది, కిశోరి వికాసం" కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టి, అనంతరం అంగన్‌వాడి సిబ్బంది గృహ సందర్శనలు చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, 3 నుంచి 6 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరినీ తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు నర్సరీ, ఎల్‌కేజీ యూకేజీ తరగతులుగా విభజించి ఆటపాటలతో కూడిన నాణ్యమైన ప్రాథమిక విద్యను అందిస్తామని తెలిపారు. దీనివల్ల పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల బాగుంటుందని వివరించారు.

*బాల్య వివాహాలు అరికట్టాలి.. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి: అనంతరం నిర్వహించిన 'కిశోరి వికాసం' కార్యక్రమంలో భాగంగా కౌమార బాలికల ఆరోగ్యం, హక్కులపై అవగాహన కల్పించారు. సమాజానికి శాపంగా మారిన బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని పిలుపునిచ్చారు. బాలికల్లో రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జీవన నైపుణ్యాల ప్రాధాన్యతను వివరించారు. ప్రస్తుతం యువతను ఆకర్షిస్తున్న జంక్ ఫుడ్స్ వల్ల కలిగే అనారోగ్యాలను వివరిస్తూ, వాటికి దూరంగా ఉండి పోషక విలువలు గల ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు అంగన్‌వాడి ఉపాధ్యాయులు దుర్గ, లక్ష్మి, మహేశ్వరి, రాధ, నాగశేషి, ఆదిలక్ష్మి మరియు స్థానిక మహిళలు, బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!