జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం.
• పింఛన్, పక్కా ఇళ్లు, ప్రమాద బీమా కోసం కృషి
• రక్షణ చట్టం అవసరం ఉంది.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. న్యాయం చేస్తాం.
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం..
అనంతపురం, జూన్ 20 :
జర్నలిస్టులకు పింఛన్, పక్కా ఇళ్లు, ప్రమాద బీమా సౌకర్యం న్యాయమైన కోర్కెలు.. వాటి పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తానని రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం నిర్వహకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు. సిఎం చంద్రబాబు అనుభవంతో ఇప్పుడిప్పుడే గాడిలో పెతున్నాం.. వచ్చే ఆదాయం ఒకటో తారీఖున జీతాలు, పింఛన్లకే సరిపోతుందని, కేంద్రం నుంచి వచ్చే నిధులు గత ప్రభుత్వం చేసిన వడ్డీలకే సరిపోవడం లేదు అన్నారు. అయినా.. న్యాయమైన జర్నలిస్టుల డిమాండ్లు సీఎంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సోషల్ మీడియా వల్ల సమాజానికి ఎంత మంచి ఉందో.. అంతకంటే చెడు ఎక్కువగా ఉందన్నారు. భావాప్రకటన స్వేచ్ఛ ఉందని ఇతరుల హక్కులకు భంగం కలిగించరాదన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతగా పని చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ నాది కూడా జర్నలిస్టుల కులమని, జర్నలిస్టుగా పని చేసిన నాకు వాళ్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు నాకు బాగా తెలుసు అన్నారు. వారి సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి
పరిష్కారం కోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కృషి చేయాలని అన్నారు. సోషల్ మీడియా మంచికి వాడుకోవాలని, ఈనాడు జర్నలిస్ట్స్ బ్యాచ్ అందరం వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని.. ఎన్నో మంచి విషయాలు, అంశాలపై చర్చ ఉంటుందన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, ఐజేయూ జాతీయ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా వల్ల కలిగే ప్రయోజనాలు, దుస్స్వభావాలు వివరించారు. భావాప్రకటన స్వచ్చ దృష్ట్యా సోషల్ మీడియాను రద్దు చేయాలనడం సరైంది కాదని. అయితే నియంత్రణ ఉండాలని అన్నారు. ఐజేయూ జాతీయ సెక్రటరీ జనరల్ సోమసుందర్ మాట్లాడుతూ సోషల్ మీడియాను సమాజం హితం కోసం ఉపయోగించాలని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టులకు పింఛన్, ప్రమాదబీమా, పక్కా ఇళ్లు స్థలాలు ఇవ్వాలని ఐజేయూ ప్లీనరీలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీఎం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు గా సహకారాలు అందిస్తామని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఏపీఐఐసీ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్ బాబు, ఐజేయూ కార్యవర్గ సభ్యులు నాగరాజు, ఐజేయూ కౌన్సిల్ సభ్యులు నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండప్ప, షకీల్ షఫీ, అనంత లక్ష్మీ విద్యాసంస్థల అధినేత ఆనంతరాముడు, ఏపీడడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి మహమ్మద్ ఆయుఫ్ సహా యూనియన్ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
