*పెన్నహోబిలం:* అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శనివారం యోగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శరీరం, మనస్సు మరియు ఆత్మల సమన్వయానికి యోగా ఎంతో అవసరమని చాటిచెబుతూ, దేవస్థాన కార్యనిర్వాహణాధికారి,రమేష్ బాబు,ఆలయ చైర్మన్ రేగటి నాగరాజు మరియు ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా చైర్మన్ రేగటి నాగరాజు మాట్లాడుతూ, యోగా అనేది భారతీయ సంస్కృతి అందించిన గొప్ప వరం అని కొనియాడారు. యోగా సాధన ద్వారా ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసట తగ్గి, ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. నిత్యం యోగా చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను పొందవచ్చని సూచించారు.
అనంతరం ఉరవకొండకు చెందిన యోగా మాస్టర్ సునీత, భక్తులకు మరియు దేవస్థాన సిబ్బందికి వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామ విధానాలను ప్రదర్శించి సాధన చేయించారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు మోపిడి గోవిందు, ప్రధాన అర్చకులు ఎ.ఎన్. ద్వారకనాథాచార్యులు, అర్చకులు ఎం. బాలాజీ, దేవస్థాన సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.

