కోర్టు ప్రవేశ ద్వారం వద్ద న్యాయమూర్తి కారు పార్కింగ్: ఇబ్బందుల్లో కక్షిదారులు, దివ్యాంగులు


 

ఉరవకొండ జూన్, 17

:న్యాయదేవత ఆలయం అందరికీ సమానమే, కానీ అక్కడ అధికారులు అనుసరించే తీరు సామాన్యులకు, దివ్యాంగులకు ఇబ్బందికరంగా మారితే ఎలా ఉంటుందనడానికి ఉరవకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలోని ఈ దృశ్యాలే నిదర్శనం. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తికి చెందిన కారును కోర్టు ప్రధాన ప్రవేశ ద్వారం వద్దే పార్కింగ్ చేయడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సామాన్యుల అవస్థలు.. దివ్యాంగుల వేదన

కోర్టు కార్యకలాపాల కోసం ప్రతిరోజూ వందలాది మంది కక్షిదారులు వస్తుంటారు. అయితే, ప్రవేశ ద్వారం వద్దే కారు పార్క్ చేయడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు కోర్టు లోపలికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 అభ్యంతరం తెలిపేదెవరు?:కారు పార్కింగ్ వల్ల కలిగే ఇబ్బందుల గురించి ప్రశ్నించడానికి సామాన్య కక్షిదారులు, వృత్తిపరంగా ఇబ్బంది పడుతున్న న్యాయవాదులు కూడా భయపడుతున్నారు. మౌనంగా తమ కష్టాన్ని దిగమింగుకుంటూ లోపలికి వెళ్తున్న దృశ్యాలు ఆవేదన కలిగిస్తున్నాయి.

 సువిశాల ప్రాంగణం ఉన్నా.. కోర్టు ఆవరణలో కార్లను పార్కింగ్ చేయడానికి తగినంత ఖాళీ స్థలం ఉన్నప్పటికీ, డ్రైవర్ కావాలనే ప్రవేశ ద్వారం వద్ద వాహనాన్ని నిలిపారా? లేక అవగాహన లోపమా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఒక్కరి కోసం వందమంది ఇబ్బందులు

న్యాయస్థానానికి వచ్చే కక్షిదారుల సౌకర్యం చూడాల్సిన బాధ్యత అధికారులది. కానీ, ఒక్క వాహనం కోసం వందలాది మంది ప్రజలు ఇబ్బంది పడాల్సి రావడం విచారకరం" అని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి తప్ప, ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించడం సరికాదని పలువురు హితవు పలుకుతున్నారు.

ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఈ అడ్డంకిని వెంటనే తొలగించి, నిర్ణీత పార్కింగ్ స్థలంలో వాహనాన్ని నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు వచ్చే కక్షిదారులు కోరుతున్నారు.