జిల్లా ఎస్పీ జగదీష్ స్పందించాలని మహిళల డిమాండ్
ఉరవకొండ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో జూదరులు రెచ్చిపోతున్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలను అడ్డాగా మార్చుకుని లక్షలాది రూపాయల పేకాట దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ముఖ్యంగా *పాల్తూరు, హావలిగి, కరకముక్కల* గ్రామ శివారులతో పాటు, సరిహద్దు గ్రామలైన *గోవిందవాడ, బొమ్మనహాల్* మరియు బొమ్మనహాల్ మండల పరిధిలోని *దర్గా హోన్నూరు* పరిసర ప్రాంతాల్లో జూదం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. రోజుకు లక్షలాది రూపాయలు ఇక్కడ చేతులు మారుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు.
వెనుకబడిన ప్రాంతాల్లో 'గుల్ల' అవుతున్న సంసారాలు
ఆర్థికంగా వెనుకబడిన ఈ ప్రాంతాల్లోని ఉపాధి కూలీలు, స్వల్ప ఆదాయ వర్గాల ప్రజలు జూదం వైపు ఆకర్షితులవుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పేదలు తమ కష్టార్జితాన్ని పేకాట రూపంలో తగలబెడుతున్నారు. దీంతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, సంసారాలు గుల్లా అవుతున్నాయని స్థానిక మహిళలు కన్నీరుమున్నీరవుతున్నారు.
చోటామోటా నాయకుల అండ.. పోలీసుల 'మీనమేషాలు'
ఈ అక్రమ జూదాల వెనుక అధికార పార్టీకి చెందిన కొందరు చోటామోటా నాయకుల హస్తం ఉన్నట్లు గట్టిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం క్షేత్రస్థాయి పేకాట మాత్రమే కాకుండా, మొబైల్ జూదాలు కూడా విచ్చలవిడిగా సాగుతున్నా.. వాటిని నివారించడంలో సర్కిల్ పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ప్రజలు బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
పెరిగిన దొంగతనాలు.. మిరప పంట సైతం మాయం!
జూద వ్యసనానికి బానిసలైన కొందరు డబ్బుల కోసం గ్రామాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో కొన్ని గ్రామాల్లో వరుస దొంగతనాలు జరగడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. చివరకు రైతులు కష్టపడి పండించి దాచుకున్న *మిరప పంటను సైతం రాత్రికి రాత్రే దొంగిలించి* ఆ సొమ్మును పేకాట అడ్డాల్లో తగలబెడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ దొంగతనాలను అరికట్టడంలోనూ పోలీసులు విఫలమయ్యారని గ్రామస్తులు ఎండగడుతున్నారు.
అధికారుల కొరతా? బాధ్యతారాహిత్యమా? ఉరవకొండ సర్కిల్ పరిధిలో ఇద్దరు సీఐలు ఉండాల్సి ఉండగా, రూరల్ సర్కిల్ అధికారి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం అర్బన్ సీఐ అదనపు బాధ్యతలు చూస్తున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో క్రైమ్ కట్టడికి, జూదాల నియంత్రణకు ఆయన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఎస్పీ గారూ.. స్పందించండి!
సరిహద్దుల్లో సాగుతున్న ఈ అక్రమ జూద దందాను అరికట్టేందుకు *జిల్లా ఎస్పీ జగదీష్* తక్షణమే స్పందించాలని బాధితులు, గ్రామస్తులు కోరుతున్నారు. ప్రత్యేకంగా క్రైమ్ కంట్రోల్ స్క్వాడ్' ను ఏర్పాటు చేసి, అసాంఘిక శక్తుల అడ్డాలపై ఆకస్మిక దాడులు నిర్వహించాలని, పేద కుటుంబాలను వినాశనం నుంచి కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

