అనంతపురం: జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం నగరంలోని స్థానిక 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ పుల్లయ్యకు ఆయన ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా షేక్ బాబా సలామ్ మాట్లాడుతూ, ఒక యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జనసేన నేత కిరణ్ రాయల్ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారని ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య రాజకీయాలకు ఏమాత్రం తగవని పేర్కొంటూ, సంబంధిత వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, అసభ్యకర వ్యాఖ్యలు సమాజానికి మంచివి కావని షేక్ బాబా సలామ్ అన్నారు. ప్రజల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి లభిస్తున్న ఆదరణను ఓర్వలేక కొందరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. ఇలాంటి రాజకీయ సంస్కృతిని ప్రజలు సమర్థించరని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ విమర్శలకు బదులుగా ప్రజా సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు కొనసాగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ ఫిర్యాదు కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బెడదల శ్యాంసుందర్ రెడ్డి, కే.సీ. శ్రీకాంత్, శ్రీకాంత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రచార విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కల్లు రమేష్ గౌడ్, అనంతపురం నగర సోషల్ మీడియా అధ్యక్షుడు గొళ్ల శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రవీంద్ర రాయల్, శ్రీనివాసులు, బండారు మనోజ్ కుమార్, సాయి ప్రసాద్, షామిర్ షా తదితరులు పాల్గొన్నారు.
