పామిడి మండలం, పి.కొత్తపల్లి, జూన్ 30:
ఉరవకొండ మండలం, శ్రీ గవి మఠం సంస్థానానికి చెందిన పామిడి మండలం పి.కొత్తపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 110/2లో ఉన్న 6 ఎకరాల 44 సెంట్ల వ్యవసాయ భూమిని మంగళవారం రెండు భాగాలుగా విభజించి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహించారు.
వేలంపాటలు పోటాపోటీగా సాగగా, ఎకరానికి రూ.1,86,000 గుత్త లభించింది. గత ఏడాది ఇదే భూమికి ఎకరానికి రూ.30,000 మాత్రమే గుత్త రావడంతో, ఈసారి గణనీయమైన పెరుగుదల నమోదైంది.
ఈ వేలం ప్రక్రియను శ్రీ గవి మఠం అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షించారు. సత్యసాయి జిల్లా దేవాదాయ శాఖ డీఈవో బి. నరసింహారాజు, అనంతపురం డివిజన్ తనిఖీ అధికారి ఎం. వన్నూర్ స్వామి, తాడిపత్రి గ్రూప్ దేవాలయాల ఈవో రామాంజనేయులు హాజరై పర్యవేక్షించారు.
కార్యక్రమంలో పి.కొత్తపల్లి గ్రామస్థులు, ఆలయ సిబ్బంది, పాటదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేలం ప్రక్రియను విజయవంతం చేశారు.
