ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై కూలీల దాడి


 

ఉరవకొండలోని ఉపాధి హామీ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉరవకొండ మండలం లత్తవరం తండాకు చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రవి నాయక్‌పై అదే గ్రామానికి చెందిన కొందరు కూలీలు దాడి చేసి కొట్టారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులను దుర్వినియోగం చేశారంటూ కూలీలు ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. కూలీల ఆరోపణల ప్రకారం, గ్రామంలో చేపట్టిన ఇంకుడు గుంతల పనులకు సంబంధించిన సుమారు రూ.3.50 లక్షల మొత్తాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ రవి నాయక్ కాజేసార ని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేదని, దీంతో ఆగ్రహించిన కూలీలు కార్యాలయం వద్ద ఆయనపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఘటనతో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఇరువర్గాలకు చెందిన వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.