అవినీతి ఎంఈఓ ఈశ్వరప్పను సస్పెండ్ చేయకుంటే ఆమరణ దీక్షకు సిద్ధం.. ఏ ఐ యఫ్ డీ యస్.. సిద్ధూ డిమాండ్



 ఉరవకొండ ఎంఈఓ ఈశ్వరప్పపై తీవ్ర అవినీతి ఆరోపణలు: వెంటనే సస్పెండ్ చేయాలని ఏ ఐ యఫ్ డీ యస్ డిమాండ్


ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో చేతులు కలిపి విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న ఉరవకొండ మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరప్పను వెంటనే విధుల్లోంచి సస్పెండ్ చేయాలని ఏ ఐ డీ యఫ్ యస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీఎం సిద్దు డిమాండ్ చేశారు. ఉరవకొండ పట్టణంలోని ఓ అగ్ర కుల ప్రైవేట్ పాఠశాల అక్రమాలను ప్రశ్నించిన విద్యార్థి సంఘాల పట్ల ఎంఈఓ ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి, సదరు పాఠశాల యాజమాన్యంతో నడిపిన ఆర్థిక సంప్రదింపులపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లంచాల కక్కుర్తి.. ‘వాటాల’ బేరసారాలు!

ఈ సందర్భంగా సీఎం సిద్దు మాట్లాడుతూ, ఉరవకొండలోని పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, విచ్చలవిడిగా పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ విక్రయాలపై ఎంఈఓ ఈశ్వరప్పకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా.. ఆయన అత్యంత నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా సమాధానమిచ్చారన్నారు.

ఈరోజు సెలవు.. మీకేమైనా సమస్య ఉంటే అనంతపురంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి వెళ్ళి చెప్పుకోండి" అంటూ ఎంఈఓ ఫోన్ కట్ చేశారని సిద్దు ఆరోపించారు. అంతేకాకుండా, ఫిర్యాదు అందిన వెంటనే సదరు పాఠశాల యాజమాన్యానికి ఫోన్ చేసి, అక్రమాలను కప్పిపుచ్చడానికి నా వాటా నాకు పంపండి అంటూ నేరుగా లంచం డిమాండ్ చేస్తూ బేరసారాలకు దిగడం ఎంఈఓ అవినీతికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు పాతర

పాఠశాలల ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫారాలు విక్రయిస్తే సదరు విద్యాసంస్థలను సీజ్ చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారులు మీడియా సాక్షిగా హెచ్చరించినప్పటికీ, ఉరవకొండ ఎంఈఓ మాత్రం ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని విద్యార్థి నేతలు మండిపడ్డారు. పాఠశాలలో యథేచ్ఛగా అక్రమ వ్యాపారం సాగుతున్నా ఎంఈఓ కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు అందాయనే సంకేతాలు స్పష్టమవుతున్నాయని ఆరోపించారు. ఈశ్వరప్పకు సదరు పాఠశాల యాజమాన్యంపై ఉన్న 'ప్రత్యేక ప్రేమ' వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

సస్పెండ్ చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష!

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి కొమ్ముకాస్తూ, ప్రభుత్వ జీతాలు తింటూ ప్రైవేట్ యాజమాన్యాలకు తొత్తులుగా మారిన ఎంఈఓ ఈశ్వరప్పపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయన్ను విధులనుంచి తొలగించాలని ఏ ఐ యఫ్ డీ యస్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో, ఎంఈఓ సస్పెన్షన్ వేటు పడేంత వరకు ఉరవకొండ కేంద్రంగా *ఆమరణ నిరాహార దీక్షకు* దిగుతామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నందు, జిల్లా విద్యార్థి నాయకుడు బ్రహ్మ, సంఘం ముఖ్య నాయకులు మధు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.