1200 గురుకుల పోస్టులకు ఇండెంట్.. భర్తీ మాత్రం 1120 మాత్రమే


 


మిగిలిన ఖాళీలపై జిల్లా కార్యాలయం చేతులెత్తివేత

ఆర్‌టీఐ చట్ట నిబంధనలపై ప్రశ్నలు.. జోన్ కార్యాలయానికి బదిలీ చేయకపోవడంపై విమర్శలు

అనంతపురం,  జూలై 13:

 ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల నియామకాలపై దాఖలైన సమాచార హక్కు (ఆర్‌టీఐ) దరఖాస్తుకు జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయం సమాధానం ఇచ్చింది. దరఖాస్తుదారు సి.ఎం. సిద్ధప్ప కోరిన వివరాలకు స్పందిస్తూ, మొత్తం 1,200 పోస్టులకు ఇండెంట్ పంపగా, కేవలం 1,120 పోస్టులను మాత్రమే మెరిట్ ఆధారంగా భర్తీ చేసినట్లు వెల్లడించింది.


మిగిలిన పోస్టులు ఎందుకు భర్తీ కాలేదనే ప్రశ్నకు, మెరిట్ జాబితాలో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం వల్లే ఖాళీలు మిగిలిపోయాయని పేర్కొంది. అయితే ఎంపికైన అభ్యర్థుల పూర్తి వివరాలు, జోన్‌వారీ పోస్టింగ్‌లు, పాఠశాలల వారీ నియామకాల వివరాలు తమ కార్యాలయంలో లేవని, అవి సంబంధిత జోన్ కార్యాలయాల పరిధిలో ఉన్నాయని సమాధానంలో తెలిపింది. అలాగే మిగిలిన ఖాళీల భర్తీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తరువాత మెరిట్ ప్రకారం చేపడతామని పేర్కొంది.


అయితే జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయం ఇచ్చిన ఈ సమాధానంపై ఆర్‌టీఐ చట్ట నిబంధనల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాచార హక్కు చట్టం, 2005లోని సెక్షన్ 5(4) ప్రకారం ప్రజా సమాచార అధికారి అవసరమైతే సంబంధిత అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి దరఖాస్తుదారునికి అందించాల్సిన బాధ్యత ఉంది. అలాగే సెక్షన్ 6(3) ప్రకారం కోరిన సమాచారం మరొక ప్రజా అధికార సంస్థ వద్ద ఉంటే, దరఖాస్తును ఐదు రోజులలోపు సంబంధిత అధికారికి బదిలీ చేసి దరఖాస్తుదారునికి తెలియజేయాల్సి ఉంటుంది.


ఈ నేపథ్యంలో, "మా కార్యాలయంలో సమాచారం లేదు" అని మాత్రమే పేర్కొనడం చట్టబద్ధమైన సమాధానం కాదని, సంబంధిత జోన్ కార్యాలయం నుంచి సమాచారం తెప్పించి ఇవ్వాల్సిందో, లేదంటే దరఖాస్తును సంబంధిత అధికారికి బదిలీ చేయాల్సిందో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గురుకుల పాఠశాలల నియామకాల పారదర్శకతతో పాటు ఆర్‌టీఐ చట్ట అమలుపైనా చర్చ కొనసాగుతోంది.