ప్రతిభకు పూర్వ విద్యార్థుల ప్రోత్సాహం



 


ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఇంటర్ టాపర్లకు నగదు బహుమతులు


ఉరవకొండ,  జూలై 13:

 ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉరవకొండలోని ఎస్.కె. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల 1987–89 ఎంపీసీ, బైపీసీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.

ఎస్.కె. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు రూ.5,000, ద్వితీయ స్థానం పొందిన వారికి రూ.2,500 చొప్పున నగదు బహుమతులు అందించారు. ఇదే విధంగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోనూ రెండు గ్రూపుల టాపర్లకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.

ఎస్.కె. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ విభాగంలో ఎస్. గణేశ్వర్ 982 మార్కులతో ప్రథమ స్థానం, ఎస్. వెంకటనాగ తేజల్ 929 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. బైపీసీ విభాగంలో కె. ఫరీద్ అలీ 873 మార్కులతో ప్రథమ స్థానం, బి. లోకేష్ 812 మార్కులతో ద్వితీయ స్థానం పొందారు.

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీ విభాగంలో కె. ఉమాదేవి 946 మార్కులతో ప్రథమ స్థానం, కె. ఉమ్మే హఫ్సా 935 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. బైపీసీ విభాగంలో ఎం. కావ్య 900 మార్కులతో ప్రథమ స్థానం, కె. అమృత 897 మార్కులతో ద్వితీయ స్థానం పొందారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇరు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సంఘ సభ్యులు, దాతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విజేతలను అభినందించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను మరింత ఉన్నత లక్ష్యాల వైపు ప్రోత్సహించేందుకు పూర్వ విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కళాశాల వర్గాలు అభినందించాయి.