8 నెలలుగా అందని జీతాలు: రోడ్డున పడ్డ ఉరవకొండ నీటి పథకం కార్మికులు

 

ఉరవకొండ, జూలై 4:


అనంతపురం జిల్లా ఉరవకొండ నింబగల్లు బహుళార్ధక సాధక రక్షిత నీటి సరఫరా పథకంలో (CPWS) పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. గత 24 సంవత్సరాలుగా నిరంతరాయంగా సేవలందిస్తున్న తమకు గత 8 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు 21 మంది పథకం కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఈ మేరకు వారు ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.

కనీస వేతనాలు లేవు.. హక్కులూ లేవు!

షెడ్యూల్డ్ రేట్ల ప్రకారం తమకు నెలకు ₹20,700 జీతం రావాల్సి ఉండగా, కేవలం ₹12,000 మాత్రమే ఇస్తూ శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. రావలసిన తక్కువ జీతం కూడా ఎనిమిది నెలలుగా నిలిచిపోవడంతో ఇండ్ల అద్దెలు, కరెంటు బిల్లులు కట్టలేక, పిల్లల చదువుల ఫీజులు చెల్లించలేక కుటుంబ పోషణ భారంగా మారిందని వారు వాపోయారు. కనీసం తాగునీరు విడుదల చేయడానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు కూడా లేని దుస్థితిలో ఉన్నామని కన్నీరుమున్నీరయ్యారు.

మంత్రికి కార్మికుల విన్నపాలు:

 బకాయిల విడుదల: గత 8 నెలల పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేసి, ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందేలా చూడాలి.

 సామాజిక భద్రత: తమకు రావలసిన ఈపీఎఫ్ (పెన్షన్), ఈఎస్‌ఐ (ప్రమాద బీమా) సౌకర్యాలను వెంటనే కల్పించాలి.

తమ 24 ఏళ్ల సుదీర్ఘ సేవలను గుర్తించి, తక్షణమే స్పందించి 7 గ్రామాల పరిధిలోని కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని వారు ఆర్థిక మంత్రిని వేడుకున్నారు.