ఉరవకొండ, జూలై 4:
ఉరవకొండ మండలం శైక్ సానిపల్లి తండాకు చెందిన రైతు ఎం. సుంకే నాయక్ త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు మూడు నెలలుగా వ్యవసాయానికి అవసరమైన త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా అందడం లేదని తెలిపారు. అధికారులు రోజుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా ఉంటుందని చెబుతున్నప్పటికీ, వాస్తవానికి నాలుగు నుంచి ఐదు గంటలు కూడా అందడం లేదని ఆరోపించారు.
ఈ సమస్యపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించగా, పాత విద్యుత్ లైన్లు సరిగా నిలబడడం లేదని సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, వైర్లు కాలం చెల్లి నాసిరకంగా మారడంతో తరచూ స్తంభాలు విరిగిపోవడం, వైర్లు తెగిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.
తన వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన 11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌కు అనుసంధానమైన సుమారు 13 విద్యుత్ స్తంభాలు పదేళ్ల క్రితం ఏర్పాటు చేశారని, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తలేదని తెలిపారు. దీనిని బట్టి పాత విద్యుత్ స్తంభాలు, వైర్లే ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలకు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.
కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలు, నాసిరకంగా మారిన వైర్లను గుర్తించి వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేస్తే త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విద్యుత్ శాఖ అధికారులను రైతు ఎం. సుంకే నాయక్ కోరారు.
