ఉరవకొండలో 8 గంటల విద్యుత్ అంతరాయం.. ప్రజలు విలవిల

 



ఉరవకొండ  జూలై 5:


ఉరవకొండ పట్టణంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు ఎనిమిది గంటలపాటు విద్యుత్ లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీవ్ర అవస్థలు పడ్డారు.

సుమారు 55 వేల జనాభా కలిగిన మేజర్ పంచాయతీలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారినా, అంతరాయానికి గల కారణాలపై విద్యుత్ శాఖ అధికారులు లేదా సిబ్బంది ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం ప్రజలను మరింత ఆగ్రహానికి గురి చేసింది. విద్యుత్ బిల్లుల వసూళ్ల విషయంలో మాత్రం ఒక రోజు ఆలస్యమైనా అపరాధ రుసుము విధిస్తూ, బిల్లులు సకాలంలో చెల్లించాలని మైక్‌ల ద్వారా ప్రచారం చేసే అధికారులు, విద్యుత్ అంతరాయాలపై ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అత్యవసర పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా, మైక్ అనౌన్స్‌మెంట్ లేదా ఇతర మార్గాల ద్వారా సమాచారం ఇవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజలకు జవాబుదారీతనం చూపాల్సిన అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇక విద్యుత్ అంతరాయం కారణంగా గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ కూడా దెబ్బతింది. మోటార్లు పనిచేయక తాగునీటి సరఫరా సక్రమంగా జరగలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యుత్, తాగునీటి సమస్యలు ఒకేసారి తలెత్తడంతో పట్టణ ప్రజల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. సమస్యల పరిష్కారంలో సంబంధిత శాఖల అధికారులు పరస్పరం బాధ్యతలు నెట్టుకుంటూ కాలం గడుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర ఆర్థిక మంత్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే విద్యుత్, తాగునీటి వంటి ప్రాథమిక సమస్యలు నెలకొనడం దురదృష్టకరమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని, నాణ్యమైన విద్యుత్ సరఫరా, నిరంతర తాగునీటి పంపిణీతో పాటు సమస్యలపై ముందస్తు సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పట్టణవాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.