పదో వార్డులో ఘనంగా చిన్న మొహరం వేడుకలు



 

ఉరవకొండ  జులై 5:

ఉరవకొండ పట్టణంలోని 10వ వార్డులో చిన్న మొహరం వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అలంలను పూలతో, రంగురంగుల వస్త్రాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అలంలను భక్తులు తమ భుజాలపై మోసుకుంటూ వార్డు ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు.


వేడుకల్లో చిన్నారులు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో ప్రార్థనలు చేశారు. సంప్రదాయ డప్పుల నాదం, ప్రార్థనల మధ్య ఊరేగింపు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రజలు అలంలకు పూలమాలలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు మతసామరస్యాన్ని చాటుతూ పాల్గొనడం విశేషం. స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలు, యువకులు వేడుకల నిర్వహణలో చురుకుగా పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రశాంత వాతావరణంలో చిన్న మొహరం వేడుకలు విజయవంతంగా ముగిశాయి.