ఉరవకొండ, జులై 31:
జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (APWJF) ఆధ్వర్యంలో శుక్రవారం ఉరవకొండలో 'జర్నలిస్టుల డిమాండ్స్ డే' నిర్వహించారు. పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టిన అనంతరం ఇన్‌చార్జి తహశీల్దార్ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కోసం స్వీకరించిన దరఖాస్తులపై ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడం శోచనీయమన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఉచితంగా ఇంటి స్థలం కేటాయించి, ఇంటి నిర్మాణానికి బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు:
1. మీడియా కమిషన్ ఏర్పాటు: జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక మీడియా కమిషన్, భద్రతా చట్టం తీసుకురావాలి.
2. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్: ఇతర రాష్ట్రాల తరహాలో సీనియర్, విశ్రాంత పాత్రికేయులకు నెలవారీ పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
3. రైలు ప్రయాణంలో రాయితీ: అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు గతంలో ఉన్న ఏసీ రైలు ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలి.
4. సంక్షేమ చర్యలు: జర్నలిస్టులకు కార్మిక బీమా వర్తింపజేయడం, మీడియా అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ పునర్నిర్మాణం, విశ్రాంత జర్నలిస్టుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలి.
ఈ కార్యక్రమంలో APWJF రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పులివారి హరిప్రసాద్, నియోజకవర్గ అధ్యక్షుడు రేగటి భీమప్ప, వర్కింగ్ ప్రెసిడెంట్ మాలపాటి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి పి.వై. సుంకన్న,, నింబగల్ వెంకటేష్ , అంబరీష్ , లక్ష్మీనారాయణ, బలరామ్, దేవరింటి బాలచంద్ర నాయుడు, బాలరాజు తదితర విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

