వీబీజీ రంజీ విధానాన్ని రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలి: వ్యవసాయ కార్మిక సంఘం


 


ఉరవకొండ, జూలై 2: 2005 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధంగా అమలు చేస్తున్న వీబీజీ రంజీ విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత విధానంలోనే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయంలో ఏపీఓకు వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రంగారెడ్డి మాట్లాడుతూ, ఉపాధి హామీ కార్మికులకు ఈ రోజు చీకటి దినమని పేర్కొన్నారు. 2005లో అమల్లోకి వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ పేదలు, వెనుకబడిన జిల్లాలకు వరంలా నిలిచిందని, ఈ చట్టం వల్ల గ్రామాల నుంచి వలసలు తగ్గడంతో పాటు గ్రామీణాభివృద్ధికి తోడ్పాటుగా నిలిచిందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రంజీ విధానం వల్ల ఉపాధి హామీ చట్టం ఉద్దేశాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. కొత్త విధానంలో రోజుకు రెండుసార్లు ఫేస్ యాప్ ద్వారా హాజరు నమోదు తప్పనిసరి చేయడంతో పాటు, పనిముట్లు వంటి కనీస సౌకర్యాలను తొలగించారని విమర్శించారు. ఇప్పటికే పూర్తయిన పనులకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.

ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఏడాదిలో 60 రోజుల పాటు పనులు కల్పించకూడదనే నిబంధన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ వలసలు పెరిగే ప్రమాదం ఉందని, ఉపాధి హామీ కార్మికులు పని అడిగే హక్కును కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు ఈ చట్టమే తమకు అవసరం లేదనే పరిస్థితిని ప్రభుత్వం సృష్టిస్తోందని మండిపడ్డారు.

వెంటనే వీబీజీ రంజీ విధానాన్ని రద్దు చేసి, 2005 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శ్రీనివాసులు, సుంకన్న, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.