రాగులపాడు ఎస్‌టీ గురుకులంలో మళ్లీ నాగుపాము కలకలం.. విద్యార్థుల భద్రతపై ఆందోళన




 


ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని రాగులపాడు ఎస్‌టీ గురుకుల పాఠశాలలో ఇటీవల 9వ తరగతి విద్యార్థి తులసి నాయక్ పాము కాటుకు గురై చికిత్స పొందుతున్న ఘటన మరువకముందే, గురువారం ఉదయం మరోసారి నాగుపాము ప్రత్యక్షమవడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై రాగులపాడు గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్లను పిలిపించారు. వారు నాగుపామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే వరుసగా పాములు కనిపిస్తుండటంతో గురుకులం విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో అపరిశుభ్రత, పెరిగిపోయిన పొదలు, కలుపు మొక్కలు, సరైన పరిశుభ్రత నిర్వహణ లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని గురుకులం ఆవరణను పూర్తిగా శుభ్రపరిచి, పొదలను తొలగించి, పాములు, విషపురుగులు సంచరించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఇటీవల జరిగిన పాము కాటు ఘటన, తాజాగా నాగుపాము ప్రత్యక్షమైన నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి గురుకులంలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందనిసుబ్రహ్మణ్యం నాయక్,పలువురు అభిప్రాయపడుతున్నారు.