–
ఉరవకొండ జులై 11:
ఉరవకొండ: విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ, ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం సిద్దు హెచ్చరించారు. ఈ మేరకు ఉరవకొండలోని ఏవీఆర్ పాఠశాల యాజమాన్యానికి వినతిపత్రం అందజేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహణకు సంబంధించిన అన్ని అనుమతులు, ధ్రువపత్రాలు, రికార్డులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
గత 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల విషయంలో వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేసి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఒలింపియాడ్, ఐఐటీ, ఇతర కోచింగ్‌ల పేరుతో ప్రచారం నిర్వహించడం, పాఠశాల బస్సులపై అనుమతి లేని ప్రకటనలు ప్రదర్శించడం, శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘించడం, ప్రహరీ గోడ లేకుండా విద్యార్థుల భద్రతను నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని కోరారు.
ప్రభుత్వ జీవోలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, ఉపాధ్యాయులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఇతర చట్టబద్ధ హక్కులు కల్పించకుండా శ్రమ దోపిడీ జరుగుతోందనే ఫిర్యాదులను అధికారులు విచారించాలని డిమాండ్ చేశారు.
అలాగే పాఠశాల గుర్తింపు,డైస్ కోడ్, ట్రస్ట్ లేదా సొసైటీ నమోదు, ఫైర్ ఎన్‌వోసీ, భవన భద్రతా ధ్రువపత్రం, శానిటరీ సర్టిఫికేట్, సురక్షిత తాగునీటి ధ్రువపత్రం, అర్హత కలిగిన ఉపాధ్యాయుల వివరాలు, సీసీటీవీ, విద్యార్థుల భద్రతా కమిటీ, పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, జీపీఎస్, స్పీడ్ గవర్నర్ తదితర అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ ఉంటే యాజమాన్యం అన్ని రికార్డులను బహిర్గతం చేయాలని, లేకపోతే విద్యాశాఖ, కార్మిక శాఖ, రవాణా శాఖ, అగ్నిమాపక శాఖ మరియు జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దు డిమాండ్ చేశారు.
