హజరత్ వన్నూరుస్వామి ఉరుసు నేపథ్యంలో నేరమెట్ల గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం







ఉరవకొండ: హజరత్ వన్నూరుస్వామి ఉరుసు ఉత్సవాల సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉరవకొండ మండలం నేరమెట్ల గ్రామంలో ఉరవకొండ సబ్‌ ఇన్‌స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి ప్రజా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశం నిర్వహించి మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణ, సైబర్ మోసాలు, రోడ్డు భద్రత, బాల్య వివాహాల నివారణ, సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా పోస్టులు, సందేశాలు ప్రచురించాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.


అదేవిధంగా శక్తి యాప్, స్త్రీ రక్ష యాప్ వినియోగంపై వివరించి, అత్యవసర సేవల కోసం డయల్ 100/112, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 నంబర్లను ప్రజలకు తెలియజేశారు. చిన్నారుల రక్షణ కోసం అమల్లో ఉన్న పోక్సో (POCSO) చట్టం నిబంధనలను కూడా వివరించారు.


ఉరుసు వేడుకలు ప్రశాంతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ కోరారు. జూదం, మట్కా, ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ఎలాంటి అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.