విద్యార్థినులకు మహిళా భద్రత, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన




అనంతపురం జులై21:- అనంతపురం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫస్ట్ రోడ్డులో ఉన్న శారదా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్‌లో విద్యార్థినులకు మహిళా భద్రత, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం, నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం మూడో పట్టణ సీఐ కౌలుట్లయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఐ కౌలుట్లయ్య మాట్లాడుతూ.. మహిళలు మరియు బాలికలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలు, ఆన్‌లైన్ వేధింపులు, ఫేక్ అకౌంట్లు, ఓటీపీ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో విద్యార్థినులకు వివరించారు. అలాగే బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అలాంటి సంఘటనలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. పిల్లలపై లైంగిక నేరాల నివారణకు అమలులో ఉన్న పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరించి, ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. నూతన క్రిమినల్ చట్టాల గురించి కూడా విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థినులు చురుకుగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.