అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్లపై దొంగల దాడి..రాగి కాపర్ కాయిల్స్ చోరీ

 



మూడు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసిన దుండగులు


విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతుల ఆందోళన


ఉరవకొండలో వరుస దొంగతనాలపై ప్రజల్లో భయం


ఉరవకొండ  జూలై 04:-


అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నోబలం గ్రామంలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని విలువైన రాగి (కాపర్) కాయిల్స్‌ను చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. దుండగులు ఏకంగా మూడు ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసానికి పాల్పడటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాభావంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాము అప్పులు చేసి, దేవాదాయ శాఖ భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నామని రైతులు తెలిపారు. పంటలకు కీలక సమయంలో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్‌ను ఎత్తుకెళ్లడంతో మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, దీంతో పంటలకు నీరు అందించే పరిస్థితి లేక తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్లను లైన్‌మన్ సహాయంతో ఉరవకొండ విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయానికి తరలించారు. ట్రాన్స్ఫార్మర్లను వెంటనే మరమ్మతు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని రైతులు అధికారులను కోరారు.

ఇటీవల ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న చోరీ ఘటనలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న దుండగులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్థులు పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.