వజ్రకరూరు హాస్టళ్లలో దుర్భర పరిస్థితులు: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!

 



వజ్రకరూరు (అనంతపురం జిల్లా)

మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాలు (హాస్టళ్లు) సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస మౌలిక వసతులు కరువై, అధికారులు, వార్డెన్ల పర్యవేక్షణ లోపించడంతో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ములక బాలరామాంజనేయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన వజ్రకరూరు మండల తహసీల్దార్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.

పాముల పొదలుగా మారిన హాస్టల్ పరిసరాలు

హాస్టళ్ల నిర్వాహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని బాలరామాంజనేయులు ధ్వజమెత్తారు. హాస్టల్ ఆవరణల్లో చెత్తాచెదారం పేరుకుపోయి, పెద్ద ఎత్తున కంప చెట్లు పెరగడంతో విషసర్పాలు, కీటకాలకు నిలయాలుగా మారాయని పేర్కొన్నారు. ఇటీవల బాయ్స్ హాస్టల్‌లో రాము అనే విద్యార్థి పాము కాటుకు గురికావడం ఇక్కడి ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతోందని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టించుకోని వార్డెన్లు.. గాడి తప్పిన మెనూ!

ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాల్సి ఉండగా, ఇక్కడ నాణ్యత లేని భోజనం పెడుతున్నారని ఆరోపించారు. స్థానికంగా ఉండి విద్యార్థులను పర్యవేక్షించాల్సిన వార్డెన్లు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, వారు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొందని విమర్శించారు.

ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ పరిసరాల్లోని పొదలను, చెత్తను తక్షణమే తొలగించాలని, వార్డెన్లు స్థానికంగానే ఉండి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామనితల్లి దండ్రులతో కలిసి మొలక రామాంజీ హెచ్చరించారు.